వొడువని ముచ్చట.. ఏపీ, తెలంగాణ నీటి వాటాలపై మళ్లీ ప్రతిష్టంభన

కలం, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, నీటి వాటాల కేటాయింపు (Water Disputes), తాత్కాలిక ఫార్ములా.. ఇవన్నీ ‘వొడువని ముచ్చట’ లాగా తయారయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌ నినో పరిస్థితుల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో కనీస స్థాయిలోనే నీటి నిల్వలు ఉండడం, ఆశించినంతగా ఎగువ ప్రాంతం నుంచి రాకపోవడం.. వీటిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, తప్పనిసరి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని రెండు రాష్ట్రాలతో పాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా అభిప్రాయపడుతున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలన్నదానిపై చర్చించేందుకు సోమవారం జలసౌధలో జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వచ్చే నెల 4వ తేదీకి వాయిదా పడింది. ‘వచ్చారు.. వెళ్లారు..’ అన్నట్లుగానే తయారైంది. షెడ్యూలు ప్రకారం తొలుత ఈ నెల 13న జరగాల్సిన మీటింగ్.. 17కు వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మళ్లీ ఆగస్టు 24కు వాయిదా పడింది. ఆ ప్రకారం సమావేశమైనా నిర్ణయాలేవీ జరగలేదు.

చెరి సగం వాడుకోవాలి: తెలంగాణ

శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై త్రిసభ్య కమిటీ సోమవారం చర్చించింది. తాగునీటి కోసం మాత్రమే వాడుకోవాలని, రెండు రాష్ట్రాలకూ అవసరం ఉన్నందున విడుదల చేయాల్సిన నీటిని చెరి సగం వాడుకోవాలని తెలంగాణ ప్రతినిధి ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ ప్రస్తావిస్తూ, నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి వాటాలపై చర్చించామన్నారు. ఎల్‌ నినో దృష్ట్యా తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీరు వాడుకుంటున్నారంటూ ఏపీపై కమిటీకి కంప్లైంట్ చేశామన్నారు. ఏపీ ఈఎన్సీ సైతం తాగునీటి కోసమే వాడుకోవాలనే అభిప్రాయాన్ని కమిటీకి స్పష్టం చేశామన్నారు. కానీ రెండు రాష్ట్రాల వాటా విషయంలో మాత్రం ఎలాంటి చర్చా జరగలేదన్నారు. దీంతో కేవలం నీటి వాటాల విషయం మీదనే చర్చించేందుకు సెప్టెంబర్ 4వ తేదీకి తదుపరి సమావేశం వాయిదా పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>