Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బీజేపీ నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో వడ్లు, మొక్కజొన్న పంటలను తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ (BJP) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడం, ప్రారంభించిన చోట కూడా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండటంతో రైతులు వారాల తరబడి మార్కెట్ యార్డులలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని దళారులు, కొంతమంది అధికారులు రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నాణ్యమైన వడ్లను కూడా ‘ఏ గ్రేడ్’ నుంచి ‘బీ గ్రేడ్’గా మార్చి, తాలు-తరుగు పేరిట కోతలు విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని మండిపడ్డారు.

రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుండా దళారులు, ట్రేడర్‌లు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయని, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. జిల్లాలోని ఐకేపీ సెంటర్‌లు, మార్కెట్ యార్డులలో ఉన్న వడ్లు, మొక్కజొన్న ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాలలో కూలీల కొరత, సంచుల కొరత, సరైన రవాణా సదుపాయాల లేమితో రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని అన్నారు. కొనుగోళ్లు ఆలస్యమైతే వర్షాలకు పంట తడిసిపోతుందనే భయంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకే మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు. రైతులకు ప్రకటించిన రూ.500 అదనపు బోనస్‌ను ఇవ్వకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.

రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తుందని, చివరి గింజ కొనుగోలు అయ్యే వరకు విశ్రమించబోదని హెచ్చరించారు. అనంతరం బీ-కేటగిరీ దోపిడీని అరికట్టాలని, సంచులు, రవాణాపై అదనపు చార్జీలు రద్దు చేయాలని, తగిన లారీలు ఏర్పాటు చేయాలని, తాలు-తరుగు దోపిడీని నియంత్రించాలని కోరుతూ జిల్లా (Karimnagar) కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also:  డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు.. కోట్లాది అక్ర‌మాస్తులు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>