కలం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డిప్యూటీ కలెక్టర్ (Medchal Deputy Collector) వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయనకు సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు ఇతర కీలక ప్రాంతాల్లో ఆర్డీవోగా పని చేసిన వంశీ మోహన్ (Vamsi Mohan), తన అధికార పరిధిని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టడమే లక్ష్యంగా వంశీ మోహన్ భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో ఉన్న సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ధారాదత్తం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ భూ కుంభకోణంపై పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ బృందాలు, వంశీ మోహన్ ఇంటితో పాటు ఆయన బంధువులు, అనుచరుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి.

