తెలంగాణ రాష్ట్రంలో BJP ఏ వ్యూహంతో వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతా అయోమయం జగన్నాథం అన్నట్టుగా పరిస్థితి ఉంది. వచ్చే దఫా అధికారంలోకి వస్తామని బీరాలు పలికే పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? అన్న విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో బీజేపీ ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడింది. ఇక మోడీ వేవ్‌లో గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయేమో కానీ.. ఆ స్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేయడంలో, ప్రభుత్వాన్ని నిలదీయడంలో భారతీయ జనతాపార్టీ ఫెయిల్ అవుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీ తీసుకున్న ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన దిష్టి వ్యాఖ్యలపై నోరు మెదపని బీజేపీ.. దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీద మాత్రం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఏకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతలంతా ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ లీడర్లు సైతం అనివార్యంగా విమర్శించాల్సి వచ్చింది. ఈ విషయంలో BJP మౌనముద్ర దాల్చింది. నామమాత్రంగా కూడా ఖండించలేదు. దీనికి కారణం బీజేపీకి, జనసేన పొత్తులో ఉండటమే కావచ్చు. కానీ బీజేపీ మౌనంగా ఉండటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు.
అయితే, అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద లేని వివాదాన్ని తీసుకొచ్చి బీజేపీ రచ్చ రచ్చ చేసింది. పార్టీ అంతర్గత సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… హిందువులకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని… మందు తాగే వాళ్లకు ఒక దేవుడు, మాంసం తినేవాళ్లకు ఓ దేవుడు, పెళ్లి కానోళ్లకు ఓ దేవుడు ఉన్నారని అన్నారు. దీంతో బీజేపీ వివాదం చేసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీఎం దిష్టిబొమ్మను ఆ పార్టీ కార్యకర్తలు దహనం చేశారు. అయితే బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి విషయంలో ఒకలా.. పవన్ కల్యాణ్ విషయంలో మరోలా స్పందించారన్న విమర్శలు వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత సమస్యలు, నాయకత్వ లోపం ఇలా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎంత ఉంటుందో వేచి చూడాలి. ఇటువంటి సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్న బీజేపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. మరి బీజేపీ ఇప్పటికైనా సరైన ఎజెండాతో ముందకు వెళ్తుందా? లేదంటే ఇలాగే ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: మహిళా లాయర్లపైనా వివక్ష… ‘సుప్రీం’ బార్ అసోసియేషన్ సర్వే
Follow Us On: WhatsApp Channel


