epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మహిళా లాయర్లపైనా వివక్ష… ‘సుప్రీం’ బార్ అసోసియేషన్ సర్వే

వివక్ష.. ప్రతి రంగంలోనూ వేళ్లూనుకున్న ఒక విష వృక్షం. కులం, మతం, ప్రాంతం, భాష, వేషం.. ఒక్కటేమిటి? వివక్ష రూపాలు అనేకం. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా దీని బారిన పడినవాళ్లే. అయితే, అందరికన్నా ఎక్కువ వివక్షకు గురయ్యింది, గురవుతున్నది మహిళలే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇల్లు, సమాజం, ఆఖరికి వృత్తిలోనూ మహిళలకు నిత్యం వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) చేసిన ఓ సర్వే. మహిళా న్యాయవాదులు (Female Lawyers) కూడా వివక్షని ఎదుర్కుంటున్నారని సర్వేలో వెల్లడైంది. న్యాయ విభాగంలో మహిళాసాధికారతపై నిర్వహించిన ‘వుయ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఇన్ లా: ఏ ప్యానెల్ డిస్కషన్ ఆన్ స్ట్రెంత్, స్ట్రగుల్ అండ్ సక్సెస్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సర్వే వివరాలు వెల్లడించింది. న్యాయవాద వృత్తిలో నాయకత్వ అవకాశాలు, లింగ సమానత్వం, కెరీర్ అవకాశాలతోపాటు పెళ్లి, మాతృత్వం వంటివి చూపుతున్న ప్రభావం మీద ఈ ఎస్‌సీబీఏ సర్వే జరిగింది.

సమానావకాశాలు లేవు..

సర్వేలో పాల్గొన్న మహిళా న్యాయవాదులు 38.5శాతం మంది న్యాయవాద వృత్తి నిరుత్సాహంగా ఉన్నట్లు చెప్పగా, 25.2శాతం మంది ఎంకరేజింగ్ ఉందని సమాధానమిచ్చారు. రోజురోజుకూ తమకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు 17.6శాతం మంది చెప్పారు. ఇక అన్నిచోట్లా నాయకత్వం విషయంలో ఉన్న అసమానతలు ఇక్కడా ఉన్నట్లు వెల్లడైంది. బార్ కౌన్సిల్స్‌ నాయకత్వం విషయంలో మహిళలకు సమానావకాశాలు లేవని 57.8శాతం మంది చెప్పగా, దీనికి భిన్నంగా 42.2శాతం మంది స్పందించారు. బార్ కౌన్సిల్స్ అండ్ అసోసియేషన్స్‌లో నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి 58.9శాతం మంది ఆసక్తి చూపగా, 30.4శాతం మంది ఇష్టపడలేదు. మిగిలినవాళ్లు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. బార్ కౌన్సిల్స్ నుంచి జుడిషియరీకి మారే విషయంలో 43.1శాతం మంది సమ్మతించగా, 31.2శాతం మంది ఇష్టం లేదన్నారు.

లింగ వివక్ష..

వృత్తిలో లింగ వివక్ష ఎదుర్కొంటున్నట్లు 33.1 శాతం మంది చెప్పగా, 23.1శాతం మంది లేదన్నారు. 5.3శాతం మంది చెప్పడానికి ఇష్టపడలేదు. 29.1శాతం మంది అప్పుడప్పుడు ఎదుర్కొంటున్నట్లు చెప్పగా, 9.4 మంది క్రమం తప్పకుండా ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. సర్వేలో తొలిసారి బార్ సభ్యులైన మహిళల్లో 39.6శాతం మంది లింగ వివక్ష అప్పుడప్పుడు ఎదుర్కొంటున్నట్లు చెప్పగా, మిగిలినవాళ్లు లేదన్నారు.

పెళ్లి, పిల్లలు, లైంగిక వేధింపులు..

వృత్తిపై పెళ్లి ప్రభావం గురించి అడగ్గా, 38.2శాతం మంది మహిళా న్యాయవాదులు (Female Lawyers) వివాహం తర్వాత వృత్తిలో కొనసాగడానికి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. పిల్లలు పుట్టిన తర్వాత మరింత ఇబ్బందులు ఎదురవుతున్నట్లు 56.8శాతం మంది చెప్పారు. మెటర్నటీ లీవ్, అనువైన పని వేళలు, వంటివాటిపై 95.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెద్ద సవాల్ అని 34.2శాతం మంది చెప్పారు. జాబ్ అవకాశాలపై 16.4శాతం మంది, వేతనాలపై 14శాతం మంది, మెంటార్‌షిప్‌పై 13.7శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, వర్క్ ప్లేస్‌లలో లైంగిక వేధింపులు ఉన్నట్లు 6.2శాతం మంది చెప్పగా, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు 2.1శాతం మంది వెల్లడించారు. తమ కూతుళ్లు, తెలిసినవాళ్ల అమ్మాయిలకు న్యాయవాద వృత్తిలో కెరీర్‌ను ఎంచుకోమని సూచిస్తారా? అనే ప్రశ్నకు 64.1శాతం మంది అవునని చెప్పారు. 20.7శాతం మంది మే బీ (బహుశా చెప్పవచ్చు) అనే కోణంలో సమ్మతించగా, 15.3శాతం మంది న్యాయవాద వృత్తిలో కెరీర్‌ను ఎంచుకోవాలని చెప్పబోమన్నారు.

కార్పొరేట్ రోల్స్‌ విభాగాన్ని 39.6శాతం మంది, లిటిగేషన్‌ను 36.1శాతం మంది, జుడిషియరీని 13.5 మంది ఎంచుకుంటామనగా, అకడమిక్స్ వైపు 10.8శాతం మంది మొగ్గారు. సర్వేలో పాల్గొన్నవాళ్లలో ఫస్ట జనరేషన్ మహిళలు ఈ సమాధానాలివ్వగా, సెకండ్ జనరేషన్ మహిళలు కాస్త భిన్నంగా స్పందించారు. వాళ్లు లిటిగేషన్‌ను 29.4శాతం, జుడిషియరీని 39.2శాతం, అకాడమీని 15.7శాతం, కార్పొరేట్‌ను 9.8శాతం ఎంచుకున్నారు.

Read Also: విజయ్ తో ఫిబ్రవరిలో పెళ్లి.. స్పందించిన రష్మిక

Follow Us On: WhatsApp Channel

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>