బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6 నుంచి మొదలవుతుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న కాగా రెండో విడత నవంబర్ 11న నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగానే ఎన్నికల సమయంలో శాంతిభద్రతల అంశంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్‌క్యాస్టింగ్ కూడా అందుబాటులో ఉంటుందని, దాంతో పాటుగా మొబైల్ డిపాజిట్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నట్లు జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హింసను, ఓటర్లను, అభ్యర్థులను బెదిరించడాన్ని సహించేది లేదని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి కఠిన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సోషల్ మీడియా, ఇతర వేదికలపై నకిలీ వార్తలపై కఠినంగా వ్యవహరిస్తామని వివరించారు.
ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ ఆఖరి వారంలో ముగియనుంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించలేదు. దాంతో జేడీయూ(JDU), బీజేపీ(BJP) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రెండు సంవత్సరాలకే బీజేపీతో కూటమికి జేడీయూ స్వస్థి పలికింది. ఆర్‌జేడీ(RJD), కాంగ్రెస్‌తో కలిసి ‘మహాఘట్‌బంధన్’తో ప్రభుత్వాన్ని సిద్ధం చేశారు. మరోసారి బీహార్(Bihar) సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2024 జనవరిలో మరోసారి జేడీయూ ప్లేట్ ఫిరాయించింది. మళ్ళీ బీజేపీ పంచన చేరి.. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో ముచ్చటగా మూడోసారి నితీష్..సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్‌డీఏ, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ మధ్యే జరగనుంది.

