Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ నిర్ణయాలపై కచ్చితంగా చర్చిద్దాం: భట్టి

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీకి (RTC) సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలపై కచ్చితంగా చర్చిద్దామని ఆర్టీసీ జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన చర్చల సందర్భంగా భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని, వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రాణం అనేది అత్యంత విలువైనదని ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం మొత్తం తలకిందులైందన్నారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున తాము, కార్మిక సంఘాల నేతలుగా మీరు సమిష్టిగా కార్మికులకు పిలుపునిద్దామని (RTC strike) చెప్పారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని భట్టి అభిప్రాయపడ్డారు. సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే.. కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్నారు.

ఆర్టీసీ మనందరి సంస్థ..

భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. “ఇది మన ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం మా ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీ అనేది మన రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇతర రాష్ట్రాల్లో సంస్థల పరిస్థితి వేరుగా ఉన్నా, మన సంస్థను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ఆర్టీసీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. పాలనాపరంగా సంస్థ చిన్నాభిన్నమైంది. ఆనాడు పరిస్థితులను తట్టుకోలేక కార్మికులు సమ్మె చేసినప్పుడు, అప్పటి పాలకులు ఎంత కఠినంగా ప్రవర్తించారో మీరందరూ చూశారు. గత పాలకుల మాదిరిగా మేము వ్యవహరించబోమని స్పష్టం చేస్తున్నాను. బడ్జెట్ సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా బిల్లు, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను, ఇతర మంత్రులు బిజీగా ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక కార్మికుని కోల్పోవాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం, ఆ కుటుంబానికి ఇది తీరని లోటు. ఆర్టీసీ మనందరి సంస్థ. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా పేదలు, మహిళలకు రవాణా పరంగా ఉన్న ఏకైక మార్గం ఆర్టీసీ. వారందరినీ దృష్టిలో పెట్టుకుని, సంస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి నిలబెట్టుకోవాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉంది.” అని అన్నారు.

సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన “ఆర్టీసీ జేఏసీ” నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మీటింగ్ కి చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, దానాకిషోర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కి మంత్రులు, అధికారులు, జెఏసీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు.

Read Also: భువనగిరి కాంగ్రెస్‌లో ముసలం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>