కలం, వెబ్ డెస్క్ : నీట్ పరీక్షల వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధుల చర్చలు ముగిశాయి. ఈ చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ముందు తాము ప్రధానంగా మూడు డిమాండ్లను ఉంచినట్లు ఆయన వెల్లడించారు. నీట్ వివాదం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు.
అదేవిధంగా పేపర్ లీకేజీ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేసినట్లు సౌరవ్ దాస్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశంపై కేంద్ర మంత్రులు రేపటి వరకు సమయం కావాలని గడువు కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, నీట్ పరీక్షల అవకతవకలపై శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు.

