కరెంట్ కోతలు..సాగు కష్టాలు!

కలం, నల్లగొండ బ్యూరో : అసలే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవు. ఓ వైపు బోర్లు, బావుల కింద నారుమళ్లు సిద్ధం చేసి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా.. మరోవైపు విద్యుత్ సరఫరాలో అప్రకటిత కోతలు, తరచూ ట్రిప్పింగ్‌లు (Nalgonda Power Cuts) తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ” 24 గంటల ఉచిత విద్యుత్ హామీ ఉత్తిదేనా?” అంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో విద్యుత్ అందక వరి నార్లు ఎండిపో తుండటంతో విద్యుత్ శాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు.

ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నల్లగొండ జిల్లా దేవరకొండ, చందంపేట మండలాల్లోనూ రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి) జిల్లా పరిధిలో కాల్వలు ఆయకట్టు లేని మెట్ట ప్రాంతాల్లో బోరుబావులే వ్యవసాయానికి ప్రధాన ఆధారం. ఎల్‌నినో ప్రభావానికి తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో బోరుబావుల ద్వారా నీటి లభ్యత తగ్గుతోంది. రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు విద్యుత్ ట్రిప్పింగ్ కావడం, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తడంతో నాట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల పాలవుతున్నారు.

రోడ్డుపై ఆందోళన.. స్తంభించిన రవాణా

విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలకు తిప్పర్తి మండలం ఇండ్లూర్ రైతులు బుధవారం చేపట్టిన ఆందోళన అద్దం పడుతోంది. రైతులు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట తిప్పర్తి–నకిరేకల్ ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు, ఇతర వాహనాలను అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. “కష్టపడి పెంచుకున్న వరి నార్లు నీళ్లు లేక కళ్లముందే ఎండిపోతున్నాయి.

నాట్లు వేసే సమయంలో కరెంట్ లేకపోతే పంటలు ఎలా పండుతాయి?” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను చెబుదామని విద్యుత్ అధికారులను కలిసేందుకు ఆఫీసులకు వెళ్తే అందుబాటులో ఉండడం లేదని, ఫోన్లు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

లో వోల్టేజ్.. రిపేర్లకు వేలల్లో ఖర్చు

లో-వోల్టేజ్ కారణంగా వేలాది రూపాయల విలువైన మోటార్లు, స్టార్టర్లు, కెపాసిటర్లు తరచూ కాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. వాటి మరమ్మతులు, రీవైండింగ్ కోసం ప్రతిసారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నాణ్యత తగ్గడంతో ఓవర్‌ లోడ్‌కు గురై కాలిపోతున్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు వారాల తరబడి మార్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పగటి వేళల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో పాములు, తేళ్ల భయాన్ని లెక్కచేయకుండా పొలాలకు వెళ్లి మోటార్లు నడపాల్సిన పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదు

ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. ఇండ్లూర్‌లో రైతులు చేపట్టిన రాస్తారోకో ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయడంతో పాటు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో మార్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే లైన్‌మన్లు, ఏఈలు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అన్నదాతలకు సాగులో కొంత ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లక్షల్లో మోటార్లు.. లక్షల ఎకరాల్లో సాగు

ఉమ్మడి జిల్లాలో దాదాపు 4.50 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.
6.5 నుంచి 7.5 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, బత్తాయి వంటి పంటలు సాగు.
జూన్, జులై నెలల్లో వరి నాట్లు పూర్తవ్వాల్సి ఉండగా, వానలు లేక.. కరెంట్ సరఫరా సరిగా లేక ఎండుతున్న పంటలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>