భువనగిరి కాంగ్రెస్‌లో ముసలం!

కలం, నల్లగొండ బ్యూరో : అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే భువనగిరి (Bhuvanagiri ) కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పదవుల పంపకం, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో మొదలైన చిన్నపాటి అసంతృప్తి.. ఏకంగా ఎమ్మెల్యే ఓటమిని కాంక్షించే స్థాయికి చేరడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. నిత్యం ఎమ్మెల్యే వెంటే ఉంటూ రాజకీయంగా ఎదిగిన నేతలే ఇప్పుడు ఆయనకు గోతులు తవ్వుతున్నారా? చైర్‌పర్సన్ చేసిన వైరల్ వ్యాఖ్యలు చూస్తుంటే భువనగిరి కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందనేది స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యే ఓడిపోతేనే నియోజకవర్గానికి మేలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజానికి 40 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భువనగిరి గడ్డపై జెండా పాతిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సొంత నేతలే సంకటంగా మారారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని (MLA Kumbam) నియోజకవర్గానికి పట్టిన ‘శని’గా అభివర్ణిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కార్చిచ్చు రేపుతున్నాయి. మున్సిపల్ (Bhuvanagiri) చైర్‌పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి ఎమ్మెల్యేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసలు వివాదానికి కారణం ఇదేనా..

త్వరలో జరగబోయే మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలే ఈ విభేదాలకు కేంద్ర బిందువుగా మారాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన సీనియర్లను పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారనేది చైర్‌పర్సన్ శ్రీవాణి ప్రధాన విమర్శగా కన్పిస్తోంది. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె తన సన్నిహితులు, కార్యకర్తల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏ పార్టీలోనైనా పదవుల పంపకం అనేది అసమ్మతికి ప్రధాన కారణం అవుతుంది. భువనగిరిలోనూ ఇదే జరిగింది. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను విస్మరించి కొత్తవారికి పెద్దపీట వేస్తున్నారని చైర్‌పర్సన్ వర్గం ఆరోపిస్తోంది.

ఈ అసంతృప్తి కాస్తా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరింది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. చైర్‌పర్సన్ శ్రీవాణి చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి ఎమ్మెల్యేను నియోజకవర్గానికి పట్టిన శనిగా అభివర్ణించడం, ఆయన ఓటమిని కాంక్షించడం పార్టీ క్రమశిక్షణను ప్రశ్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నేత గెలుస్తారని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారా అన్న అనుమానాలు లేకపోలేదు.

పాత క్యాడర్ వర్సెస్ కొత్త క్యాడర్..

రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసే విమర్శల కంటే.. తోడున్న వారు చేసే ఆరోపణలే ఎక్కువ నష్టం కలిగిస్తాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే వెంటే ఉండి, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉండి ఉంటుందని ఎమ్మెల్యే కుంభం వర్గీయులు భావిస్తున్నారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు. పాత కాంగ్రెస్ కేడర్ వర్సెస్ కొత్తగా పార్టీలోకి వచ్చిన వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా కనిపిస్తోంది. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి అంతర్గత విభేదాలు పార్టీ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నాయని చెప్పాలి. నాయకులు కొట్టుకుంటే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరి వైపు ఉండాలో తెలియక నీరసించిపోయే ప్రమాదం ఉంది.

కాంగ్రెస్ బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు పుంజుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైర్‌పర్సన్ వివరణ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, మనస్పర్థలు అంత త్వరగా తొలిగిపోయే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని ఈ ముసలానికి చెక్ పెట్టకపోతే కష్టపడి సాధించుకున్న భువనగిరి (Bhuvanagiri) కోటను కాంగ్రెస్ చేజేతులా చేజార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా సాగుతున్న ఈ రాజకీయ పరిణామాలు భువనగిరిలో ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.

Read Also: ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>