కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక జీవనశైలి, సాంకేతికత, మారుతున్న పని వేళల కారణంగా ప్రస్తుత యువతలో రాత్రి ఆలస్యంగా పడుకోవడం (Late-night sleeping), ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ఒక సర్వసాధారణమైన అలవాటుగా మారిపోయింది. కానీ ఇలా లేట్ నైట్ పడుకుని మార్నింగ్ లేట్ గా లేవడం వలన మానసిక సమస్యలు, శారీరక అలసట వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఉదయాన్నే నిద్ర లేవడం (Waking Up Early) వలన ఆరోగ్యానికి కలిగే ఎన్నో లాభాలను కూడా వివరించారు.
ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వలన రోజును ప్రశాంతంగా ప్రారంభించడంతో పాటు ఒత్తిడిని తగ్గించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామానికి సమయం కేటాయించడం వంటి అనేక ప్రయోజనాలను ఈ అలవాటు అందిస్తుందట. ఉదయాన్నే లేవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో చెబుతున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గుతుంది
రాత్రి లేట్ గా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల పనులన్నీ తొందరపాటుగా చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఒత్తిడి పెరిగి పనుల్లో గందరగోళం ఏర్పడుతుంది. దీనికి బదులుగా త్వరగా నిద్రలేస్తే పనులను ఎలాంటి హడావుడి లేకుండా సమయానికి పూర్తి చేసుకోవచ్చు. ఇది మనసును తాజాగా ఉంచి ఒత్తిడిని దూరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
వ్యాయామానికి సమయం
మనం బరువు తగ్గాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని వ్యాయామం చేయడం. కాబట్టి ఉదయాన్నే లేవడం వల్ల వ్యాయామానికి కాస్త సమయం దొరుకుతుంది. రోజులో వీలైనప్పుడు చేసే వ్యాయామం కంటే ఉదయం చేసే వ్యాయామం శరీరానికి శక్తిని అందించడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఆరోగ్యమైన ఊపిరితిత్తులు
తెల్లవారుజామున వీచే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయట. ఎందుకంటే ఆ సమయంలో వాకింగ్ లేదా వ్యాయామం చేస్తూ లోతుగా శ్వాస తీసుకోవడం వలన శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
నిద్ర నాణ్యత మెరుగుపడటం
రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో అత్యంత నాణ్యమైన, గాఢమైన నిద్ర లభిస్తుందట. ఈ సమయంలోనే శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. అయితే త్వరగా పడుకోవడం వల్ల ఈ గాఢ నిద్ర సమయాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాము. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
సానుకూల ఆలోచనలు
మనం ఉదయాన్నే నిద్రలేవడం (Waking Up Early) వలన శరీరం ఆరోగ్యంగా, మనసు ఉల్లాసంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఉదయాన్నే లేచి ధ్యానం, నడక లేదా ప్రశాంతంగా గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల ఆలోచనలు పెరుగుతాయట. రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఈ అలవాటు చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
మెరుగైన జీర్ణక్రియ
రాత్రి త్వరగా పడుకునేవారు సాధారణంగా రాత్రి భోజనాన్ని కూడా త్వరగా (7 – 8 గంటల లోపు) ముగిస్తారు. ఇది జీర్ణవ్యవస్థకు తగినంత విశ్రాంతిని ఇస్తుంది, మరుసటి రోజు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
Read Also: గ్యాస్ ధరల భారం.. సూర్యుడినే ఇంధనంగా మార్చుకున్న కేఫ్
Follow Us On: Instagram

