కలం, స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా క్రికెటర్ల బసపై కీలక స్పష్టత వచ్చింది. అధికారిక హోటళ్లు నచ్చకపోతే.. ప్రత్యేక ఏర్పాట్లు బీసీసీఐ (BCCI) నే చేసుకోవాలని ఐఓఏ తేల్చి చెప్పింది. గదులు, భోజనం, రవాణా నుంచి ఆటగాళ్లు సమయానికి వేదికకు చేరే వరకు పూర్తి బాధ్యత బీసీసీఐదే. ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు ఇప్పటికే భారత పురుషులు, మహిళల జట్లకు హోటళ్లు కేటాయించారు. పురుషుల జట్టుకు మూడు నక్షత్రాల APA హోటల్ నాగోయా ఎకిమాయే కేటాయించారు. మహిళల జట్టుకు నాలుగు నక్షత్రాల మెయిటెట్సు గ్రాండ్ హోటల్ ఇచ్చారు.
అయితే సాధారణంగా క్రికెటర్లు ఉండే ఐదు నక్షత్రాల హోటళ్లతో పోలిస్తే ఇవి తక్కువ స్థాయి హోటళ్లు. అదనంగా గదులు ఇద్దరు చొప్పున పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ముందుగా పరిస్థితిని పరిశీలించనుంది. వచ్చే వారం బీసీసీఐ ప్రత్యేక బృందం జపాన్‌కు వెళ్లనుంది. హోటళ్లు, క్రికెట్ వేదిక, ఇతర సౌకర్యాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ ప్రత్యేక హోటళ్లను ఎంచుకుంటే.. వసతి మాత్రమే కాదు, భోజనం, స్థానిక రవాణా, మ్యాచ్ వేదికకు రాకపోకలు కూడా బోర్డే చూసుకోవాలి.
ఆటగాళ్లు మ్యాచ్ సమయానికి ముందే వేదికకు చేరేలా ఏర్పాట్లు చేయాలి. అయితే ప్రత్యేక హోటల్‌లో ఉన్నా క్రికెటర్లు ఏషియన్ గేమ్స్ నిబంధనలకు లోబడే ఉంటారు. భద్రత, అక్రిడిటేషన్, ప్రవేశ నిబంధనలు కొనసాగుతాయి. డోప్ టెస్టుల కోసం ఆటగాళ్లు ఎక్కడ ఉంటున్నారో సంబంధిత అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలి. భారత మహిళల జట్టు ముందుగా జపాన్‌కు వెళ్లనుంది. సెప్టెంబర్ 13న దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. సెప్టెంబర్ 14న నాగోయాకు బయలుదేరుతుంది.
సెప్టెంబర్ 18న క్వార్టర్ ఫైనల్‌తో ఏషియన్ గేమ్స్ ప్రయాణం మొదలవుతుంది. పురుషుల జట్టు సెప్టెంబర్ 21న జపాన్‌కు బయలుదేరుతుంది. వారి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయి. క్రికెట్ జట్ల బసపై బీసీసీఐ, ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు కలిసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. క్రీడాకారుల సౌకర్యం, భద్రత, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఐఓఏ స్పష్టం చేసింది.

