కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి మార్చాలని బంగ్లాదేశ్ Bangladesh ఇప్పటికే కోరింది. దానికి ఐసీసీ నిరాకరించింది. భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ప్రమాదం ఉన్నట్లు పరిస్థితులు లేవని ఐసీసీ పేర్కొంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికల మార్పునకు నిరాకరించింది. కాగా ఈ వివాదంపై తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ విషయంతో తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసింది. రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
టోర్నీకి కొన్ని వారాలే మిగిలి ఉండటంతో వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) పాల్గొనడం ప్రశ్నార్థకంగా మారింది. మంగళవారం బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ వివాదంపై స్పందించారు. ఐసీసీ నుంచి వచ్చే అన్యాయమైన అనాలోచిత ఒత్తిడిని బంగ్లాదేశ్ అంగీకరించదని చెప్పారు. గతంలో పాకిస్థాన్ భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో ఐసీసీ వేదికను మార్చిందని ఆయన గుర్తు చేశారు. ఐసీసీతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం దొరకలేదని నజ్రుల్ తెలిపారు. స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా చేర్చే అంశంపై తనకు సమాచారం లేదని ఆయన అన్నారు.
భారత్ బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ జనవరి 21ను గడువుగా నిర్ణయించింది. బంగ్లాదేశ్ తప్పుకుంటే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకునే అవకాశం ఉంది.


