Mobile Popup Ad
Mobile Popup Ad

8 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్‌కు పాకిస్థాన్ అర్హత

కలం, వెబ్ డెస్క్: ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పాకిస్థాన్ (Pakistan)  హాకీ జట్టు 2026 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్స్ సెమీఫైనల్‌లో జపాన్‌ను 4-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ కీలక విజయంతో బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న మెగా టోర్నీలో పాక్ తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభంలో జపాన్ ఆటగాడు సుబాసా తనకాకు గోల్ చేసే అవకాశం వచ్చినా అది విఫలమైంది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న పాకిస్థాన్ 9వ నిమిషంలోనే అమ్మాద్ బట్ ద్వారా తొలి గోల్ సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. అనంతరం జపాన్ చేసిన ప్రయత్నాలను అర్షద్ లియాఖత్ అడ్డుకున్నారు. అయితే 21వ నిమిషంలో వ్యూహాత్మకంగా ఆడిన జపాన్ ఆటగాడు రియోమా ఓకా గోల్ చేయడంతో తొలి సగం ముగిసేసరికి స్కోరు 1-1తో సమమైంది.

రెండో సగంలో జపాన్ దూకుడు పెంచింది. 35వ నిమిషంలో షోటా యమదా డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. 41వ నిమిషంలో పాక్ రక్షణ శ్రేణిని తలకిందులు చేస్తూ కోజీ మరో గోల్ సాధించడంతో జపాన్ 3-1తో పటిష్ట స్థితికి చేరుకుంది. ఆఖరి పది నిమిషాల్లో జపాన్ ఆటగాడు ఎల్లో కార్డ్ కారణంగా మైదానం వీడటంతో పాకిస్థాన్ చెలరేగిపోయింది. 52వ నిమిషంలో అబు మహమూద్, 55వ నిమిషంలో సుఫ్యాన్ ఖాన్ వరుసగా గోల్స్ చేసి స్కోరును 3-3తో సమం చేశారు. 57వ నిమిషంలో అఫ్రాజ్ అద్భుతమైన గోల్ చేయడంతో పాక్ 4-3 ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి నిమిషంలో జపాన్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించినా, పాక్ గోల్ కీపర్ అలీ రజా దాన్ని అడ్డుకుని మ్యాచ్‌ను ముగించారు.

Read Also: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వర్షం పడి ఆగిపోతే పరిస్థితి ఏమిటి?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>