కలం, వెబ్ డెస్క్ : పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బుధవారం కరీంనగర్ లోని సరస్వతి శిశు మందిర్ వద్ద జరిగిన ‘విభాగ్ ఖేల్ కూద్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ భారతాన్ని నిర్మించడంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల కృషి ఎంతో ఉందని అన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే కార్పొరేట్ విద్యాసంస్థలు “విద్య” అనే పదాన్ని పూర్తిగా మార్చేశాయని బండి అన్నారు. చదువు అంటే ర్యాంకులు, మార్కులు, ప్యాకేజీలు , ఫారిన్ కోసమే అన్నట్లు తయారైందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బండి సంజయ్ అన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతీకి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇస్తామన్నారు. కానీ ఆ ఊసే లేదని గుర్తు చేశారు. పదవ తరగతి పాసైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రూ.10వేలు ఇంటర్ పాస్ అయితే రూ.15వేలు డిగ్రీ పాస్ అయితే రూ.25వేలు పీజీ పాస్ అయితే లక్ష చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు.

Read Also: సొంత ఇలాఖాలో కేసీఆర్‌కు చిక్కులు
Follow Us On: Instagram


