కలం డెస్క్: పుట్టింటి బంధాన్ని తెంచుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన ఇంటి పేరును కూడా మార్చుకుంటారా?.. మెట్టించి నుంచి వచ్చిన ఇంటిపేరును పెట్టుకుంటారా?.. ఇప్పటిదాకా కల్వకుంట్ల కవితగా గుర్తింపు పొందిన ఆమె ‘దేవనపల్లి కవిత’గా మారుతారా?.. బంధాన్ని తెంచుకున్న తర్వాత పుట్టింటి పేరు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటూ వచ్చే విమర్శలకు ఫుల్ స్టాప్ పెడతారా?.. ఇవీ ఇప్పుడు రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజల్లో జరుగుతున్న చర్చ. కేసీఆర్ కుమార్తెగా రాష్ట్ర ప్రజలకు పరిచయమైన కవిత దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించిన కవితకు బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) ఆ అవకాశాలను కల్పించింది.
కొత్త పార్టీ… కొత్త పేరు…
బీఆర్ఎస్ పార్టీలో నైతికత లేదని, అవమానకరంగా తనను బైటకు పంపడంతో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా వద్దనుకుని రిజైన్ చేశానని కౌన్సిల్ వేదికగానే కవిత (Kalvakuntla Kavitha) స్పష్టత ఇచ్చారు. “పుట్టింటితో అన్ని రకాల బంధాలు, బంధనాలను తెంచుకుని బయటకు వచ్చాను… తల్లిగారి ఇంటి నుంచి అవమానభారంతో బైటకొచ్చాను… ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాను. తెలంగాణ ఆడబిడ్డలకు పౌరుషం ఎక్కువ… ఎవరినీ ఏదీ అడగరు.. అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు.. ప్రజల, దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను..” అని ప్రకటించిన కవిత ఇక నుంచి తన ఇంటిపేరును ‘దేవనపల్లి’గా మార్చుకుని ఆ పేరుతోనే చెలామణి అవుతారన్న మాటల ఆమె అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


