Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముమ్మాటికీ చేతకానితనమే: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో:  రాష్ట్రంలో వడ్ల కొనుగోలు చేయడానికి అవసరమైన సొమ్మంతా కేంద్రమే ఇస్తుంటే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏమిటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. ’వడ్లను కొంటారా? లేదా? రైతులను ఎందుకు అరిగోస పెడుతున్నారు? వడ్లు కొనుగోలు చేయడం చేతగాకపోతే అదే విషయాన్ని కేంద్రానికి చెబుతూ సీఎం లేఖ రాయండి. ఆ తరువాత జరిగే పర్యవసానాలను చూసుకుందాం’’ అని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ పర్యటనలో భాగంగా బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కమార్ వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించారు. ఐకేపీ సెంటర్‌కు వడ్లను తీసుకొచ్చి నెలరోజులైనా ఇంతవరకు కొనడం లేదని ఈ సందర్భంగా రైతులు వాపోయారు.

తాలు పేరుతో కోతలు

తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు 3 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే.. ‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్లే రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అరిగోస పడుతున్నారు. ఐకేపీ సెంటర్లన్నీ వడ్లతో నిండిపోయాయి. నెలన్నర నుండి వడ్లను తీసుకొచ్చిన కొనుగోలు కేంద్రాల్లో ఉంచినా కొనే నాథుడే లేకుండా పోయారు. వడ్ల కొనుగోలుపై సమీక్ష కూడా జరపడం లేదు. ప్లాన్ లేదు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది.’ అంటూ బండి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర నష్టం

‘ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను తీసుకొస్తే… రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల గాలివానకు తడిసి అమ్ముకోవడానికి వీల్లేకుండా వడ్లు తయారైనయ్. రైతు కష్టమంతా నీళ్లపాలువుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం కన్పించడం లేదు. రెండు నెలల నుండి మొత్తుకుంటున్నాం. వడ్ల కొనుగోలును వేగవంతం చేయండి. ఎండలకు అకాల వర్షాలకు రైతులు అల్లాడుతున్నారు. పట్టించుకోవాలని నెత్తినోరు కొట్టుకుని మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు. పైగా పచ్చి అబద్దాలు, పరస్పర విమర్శలతో దాడులు చేయడం వాళ్లకు అలవాటైంది. సరిగ్గా ఈ సీజన్ ఆరంభంలోనే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) ఏమన్నడు. రబీ సీజన్‌లో కోటి మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటిస్తే, ఇప్పటికే 80 శాతం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రులు, సీఎం అంటున్నారు. ఏది నిజం? వారి మధ్యే సమన్వయం లేకపోతే వీళ్లు చెప్పే మాటలను ఎలా నమ్మాలి?‘ అంటూ బండి ఫైర్ అయ్యారు.

కేంద్రాల వద్ద అరిగోస

’ఒకవైపు వడ్ల కొనుగోలు కేంద్రాలవద్ద రైతులు అరిగోస పడుతున్నరు. అకాల వర్షాలు, గాలివాన భీభత్సంతో వడ్లు తడిసిపోయినయ్. కొట్టుకుపోయినయ్. అయినా వాళ్ల ఆధిపత్య పోరుతో రైతులను నిండా ముంచుతున్నారు? ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇంకా ఆశ్చర్యమేందంటే…. నిన్న సివిల్ సప్లయ్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా వడ్లకొనుగోలును పూర్తి చేస్తామని ప్రకటించారు. సాధ్యమైతదా? నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. ఈనెలాఖరులోగా వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తే నేను దేనికైనా సిద్ధమే. అసలు ఈ ప్రభుత్వానికి ఏ పని చక్కగ చేయడం చేతగావడం లేదు. ఇదేందని ప్రశ్నిస్తే ప్రభుత్వ చేతగాని తనాన్ని కేంద్రంపై నెట్టడం అలవాటైంది. మంచి జరిగితే మా ఘనతే అని జబ్బలు చరుచుకుంటారు. ఇకనైనా వడ్ల కొనుగోలును యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి.‘ అంటూ బండి పేర్కొన్నారు.

తడిసిన వడ్లను కొనుగోలు చేయాలి

‘తడిసిన వడ్లకు తరుగు, తాళు, తేమ లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలి. సన్న, దొడ్డు వడ్లనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు 500 చొప్పున బోనస్ చెల్లించాలి. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. సింగరేణి ఆఫీసులను ధ్వంసం చేయాలని, రైలు పట్టాలని కోసేయాలని, జీఎం ఆఫీసు తగలబెట్టాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పడం దుర్మార్గం. బీఆర్ఎస్ తీరుకు సుమన్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. బీఆర్ఎస్ చేసే కార్యక్రమాలకు ప్రజలెవరూ రావడం లేదని తేలిపోయింది. విధ్వంసాలతో డబ్బులు వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రజాస్వామ్యంలో దాడులు, విధ్వంసాలకు చోటు లేదు. అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. తగిన చర్యలు తీసుకోవాలి.‘ అంటూ బండి (Bandi Sanjay) డిమాండ్ చేశారు.

Read Also: గురుకులాల సీట్ల భర్తీపై భట్టి కీలక ఆదేశాలు

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>