కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలో పందుల సంచారం వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ (Nirmal Municipality) రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పందుల నియంత్రణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పందుల పెంపకందారులు స్వచ్ఛందంగా సహకరించి, తమ పందులను పట్టణానికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలోకి తరలించాలని సూచించారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే విధంగా పందులను పట్టణ పరిధిలో సంచరించనివ్వొద్దని కోరారు. సూచనలను పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించే పందుల పెంపకందారులపై తెలంగాణ పురపాలక చట్టం–2019 నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

