Mobile Popup Ad
Mobile Popup Ad

గురుకులాల సీట్ల భర్తీపై భట్టి కీలక ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో:  రాబోయే విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో ప్రతి సీటూ తప్పనిసరిగా భర్తీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka)  అధికారులను ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. సీట్లు పూర్తిగా భర్తీ కాని పాఠశాలలపై ప్రత్యేక అధ్యయనం చేసి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

గురుకులాలు సిద్ధం చేయండి

జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, వేసవి కాలంలోనే అవసరమైన అన్ని రకాల మరమ్మతులు, మౌలిక వసతుల పనులను పూర్తి చేసి గురుకులాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ వేదికగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌లతో కలిసి గురుకుల, సంక్షేమ వసతి గృహాల పనితీరుపై డిప్యూటీ సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రతి విద్యాసంస్థకు ఓ జిల్లా అధికారి

​గురుకులాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకుగాను, ప్రతి విద్యాసంస్థకూ ఒక జిల్లా అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) ప్రకటించారు. ఈ అధికారులు ప్రతి నెల పాఠశాలలను సందర్శించి క్షేత్రస్థాయి నివేదికలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం విద్యాసంస్థల్లో డైట్‌ఛార్జీలు, మెనూ వివరాలను తప్పనిసరిగా బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్తూ.. ప్రతి నెల వైద్యులు విధిగా పాఠశాలలను సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్కూల్ ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందించాలని, రాబోయే 12 రోజుల్లో ప్రాంతీయ సమన్వయకర్తలు అన్ని పాఠశాలలను చెక్‌లిస్ట్ ప్రకారం తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలను సిద్ధం చేయండి


మరోవైపు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను, ఈ కొత్త పాఠశాలలు పూర్తి కాగానే వాటిలోకి మార్చేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యా రంగానికి నిధుల కొరత లేదని, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, అద్దెలు, మరమ్మతుల నిధులను ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేస్తోందని గుర్తుచేశారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల బిల్లులను క్లియర్ చేశామని, విద్యాశాఖ పనుల కోసం డీఎంఎఫ్‌టీ నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందుతున్నప్పటికీ, భవిష్యత్ అవసరాల కోసం సొంత భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని విద్యుత్ విద్యాశాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Also: వైభవ్ సూర్యవంశీకి ఇండియా-ఏ ఛాన్స్.. ఐపీఎల్‌లో భారీ అంచనాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>