ప్రశ్నార్థకంగా స్వర్ణ ఆశ్రమ బాలికల భద్రత!

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. సుమారు 354 మంది గిరిజన బాలికలు విద్యను అభ్యసిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, ఆహార నాణ్యత, విద్యా నిర్వహణ అన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి.

రాత్రి వేళ బాలికలకు వాచ్‌మెన్ ఒక్కరే ఆధారం..

బాలికల హాస్టల్‌లో రాత్రి వేళల్లో సూపర్వైజర్, మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం అందుబాటులో ఉండాల్సి ఉన్నా, సాయంత్రం కాగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో వందలాది బాలికల బాధ్యత ఒక్క వాచ్‌మెన్‌పై పడుతోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించే సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

వర్షాకాలంలోనూ ఏఎన్‌ఎం గైర్హాజరు..

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యార్థులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వారికి వెంటనే వైద్యసేవలు అందించాల్సిన ఏఎన్‌ఎం రాత్రివేళల్లో హాస్టల్‌లో ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది.

పనిచేయని సీసీ కెమెరాలు..

బాలికల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఇప్పటికే భద్రతా సిబ్బంది లేకపోవడం, మరోవైపు నిఘా వ్యవస్థ కూడా నిర్వీర్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టడీ అవర్స్‌కు డుమ్మా..

విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించే సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉన్నా, బస్సులు దొరకవని చెప్పి ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేసుకున్న వెంటనే ఇంటికి వెళ్లిపోతున్నారని సమాచారం. దీంతో విద్యార్థులకు చదువులో సరైన మార్గనిర్దేశం లేకుండా పోతోంది. జిల్లా కేంద్రానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలను ఇప్పటివరకు సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.

పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన బాలికల భద్రత, ఆరోగ్యం, విద్యా ప్రమాణాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి ఆశ్రమ పాఠశాలలో సమగ్ర విచారణ జరిపించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

విద్యార్థులపై హెడ్‌మాస్టర్ ఆగ్రహం..!

ఆశ్రమ బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యలను విలేకరులకు వెల్లడించారని విద్యార్థులపై పాఠశాల హెడ్‌మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రార్థన సమయంలో విద్యార్థులను హెచ్చరిస్తూ, “మీ అనుమతితోనే ఇంటికి వెళ్తున్నారు కదా.. మరి పాఠశాల విషయాలను బయటివారికి ఎందుకు చెబుతున్నారు?” అంటూ మందలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు: డీటీడీఓ

స్వర్ణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ) జాదవ్ అంబాజీ తెలిపారు. ఏఎన్ఎం హాస్టల్‌లో విధులు నిర్వహించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే స్టడీ అవర్స్ సమయంలో విధుల్లో లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>