epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

డ్రగ్స్​ కేసుపై బాంబు పేల్చిన బండి సంజయ్​

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణలో డ్రగ్స్ (Drugs) నిర్మూలన కోసం పనిచేస్తున్న ‘ఈగల్’ టీం పనితీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈగల్ టీంలో సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ, ఒకరిద్దరు మాత్రం డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ (Akun Sabharwal) ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ విచారణను బండి సంజయ్ (Bandi Sanjay) ప్రస్తావించారు. ఆ విచారణ సమయంలో పట్టుబడిన నిందితులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నామని వాంగ్మూలం ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఆ నివేదికలు బయటకొస్తే తమ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని భయపడి, కేసీఆర్ అప్పట్లో అకున్ సబర్వాల్‌ను అర్ధాంతరంగా బాధ్యతల నుండి తప్పించారని పేర్కొన్నారు.

అకున్ సబర్వాల్ సేకరించిన కీలకమైన ఆడియో, వీడియో రికార్డులు, వాంగ్మూలాలను నాటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ నివేదికలను తదుపరి విచారణ బృందాలకు గానీ, కోర్టుకు గానీ అందజేయకుండా తొక్కిపెట్టి కేసును పూర్తిగా నీరుగార్చారని ఆయన మండిపడ్డారు.

సోమేశ్ కుమార్‌ను విచారించాలి..

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్రగ్స్ నిర్మూలనపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే ‘ఈగల్’ టీం రంగంలోకి దిగి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను విచారించాలని బండి సంజయ్ డిమాండ్ (Bandi Sanjay) చేశారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయో తేల్చాలన్నారు. ప్రస్తుత ఈగల్ టీం పనితీరుపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటి దాడుల్లో డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అసలు ఈగల్ టీంకు చట్టపరమైన అధికారాలు ఉన్నాయా లేదా అని ఆయన నిలదీశారు.

మళ్లీ అకున్ సబర్వాల్‌కు బాధ్యతలివ్వాలి..

రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలంటే, తిరిగి అకున్ సబర్వాల్ వంటి కఠినమైన అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించాలని బండి సంజయ్ సూచించారు. పండుగలు, కొత్త ఏడాది వేడుకల సమయంలో హడావుడి చేసి కేసులు నమోదు చేస్తే సరిపోదని, మూలాల్లోకి వెళ్లి డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Read Also: వివాదంలో రాంచరణ్ ‘పెద్ది’

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>