కలం, కరీంనగర్ బ్యూరో: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల (6 Guarantees) గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రంగా మండిపడ్డారు. అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ ఘాటైన విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. అబద్ధాలాడటంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అంటూ ఎద్దేవా చేశారు. గతంలో బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటములకు కూడా రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన (Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ సవాల్ విసిరారు. “సీఎంగారు… కేరళ మీడియాను వెంట తీసుకుని తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళదాం. మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ, వృద్ధులకు రూ.4000 పెన్షన్, నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు భరోసా కార్డు, రైతులకు రైతు భరోసా.. ఇవన్నీ అమలు చేస్తున్నట్టు మీరు నిరూపిస్తే నేను వెంటనే నా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా” అని స్పష్టం చేశారు.
అలాగే, “ఈ పథకాలలో ఒక్కటైనా అమలు కాలేదని నేను నిరూపిస్తా. అప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెబుతారా?” అంటూ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే భరోసా కూడా పూర్తిగా అందడం లేదని, ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదని, పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేరళలో కూడా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చివరగా కేరళ ప్రజలు, మీడియాను ఉద్దేశిస్తూ.. “వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు నిజం చెప్పాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ సవాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also: డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

