కలం, మహబూబ్ నగర్ బ్యూరో : రైతుల ఆదాయం పెంచడంతో పాటు నీటి వనరులు, భూసారాన్ని పరిరక్షించేందుకు ఉద్యానవన, తక్కువ నీటి వినియోగ పంటల సాగును ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) అన్నారు. బుధవారం భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు, గ్రామ సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, టిజిఎస్పిడిసిఎల్ సిఎండి జితేష్ పాటిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మారి వర్షాభావం ఏర్పడుతున్నందున వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌పామ్, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. తక్కువ వర్షపాతం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
రైతులకు నాణ్యమైన కూరగాయల నారు, విత్తనాలు, మల్చింగ్, పందిళ్లసాగు వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు సమూహాలుగా ఏర్పడి సాగు వివరాలను ఉద్యానవన శాఖకు అందిస్తే అవసరమైన నారును తెప్పించి అందించే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, కొత్తకోట సమీపంలోని శంకరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే మార్కెటింగ్ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
రైతులకు సబ్సిడీలు త్వరగా మంజూరు చేయాలని అధికారులను కోరారు. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలోని గ్రామాల్లో తక్కువ వోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బూత్పూర్లో విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

