కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ముందస్తు బెయిల్ మంజూరుపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన పోక్సో కేసు చెల్లనేరదని, ఆ అమ్మాయి మైనర్ కాదని హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో బండి భగీరథ్ (Bandi Bhagirath) కోరారు. ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. బాధితురాలు పుట్టినరోజు తేదీలపై పోలీసులు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. బాలిక పుట్టిన తేదీ విషయమై పరస్పర విరుద్ధమైన సర్టిఫికెట్లు జారీ కావడంతో వాస్తవమైన తేదీని తేల్చాలని పోలీసులకు స్పష్టం చేసి తదుపరి విచారణను ఒక రోజు వాయిదా వేసింది.
మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ 2021లో నిర్మల్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో ఆమె 9వ తరగతి చదువుతున్నట్లుగా బాలిక తండ్రి వివరించారని బండి భగీరథ్ (Bandi Bhagirath) తన పిటిషన్‌లో గుర్తుచేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. బర్త్ సర్టిఫికెట్‌లో సైతం వేర్వేరు తేదీలు ఉన్నాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌లో 2008 ఆగస్టు 12న హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో పుట్టినట్లుగా ఉన్నదని, ‘మీ సేవ’ ద్వారా 2024లో తీసుకున్న బర్త్ సర్టిఫికెట్‌లో 2010 ఆగస్టు 12న నిర్మల్‌లోని ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో పుట్టినట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలను విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read Also: చమురు సంక్షోభం.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం..!
Follow Us On: Instagram

