కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో గంటల తరబడి కూర్చోవడం సర్వ సాధారణం అయిపోయింది. యువతలో వెన్నెముక సమస్యలు పెరుగుతున్నాయి. శరీర ఆకృతి (పోశ్చర్) దెబ్బతినడం వల్ల కేవలం వెన్నునొప్పి(Back Pain) మాత్రమే కాకుండా, ఇతర అవయవాల పనితీరుపైనా ప్రభావం పడుతుందని యోగా నిపుణురాలు రూపల్ సిద్ధపురా ఫరియా (Rupal Sidhpura Faria) హెచ్చరిస్తున్నారు.
వెన్నెముకను శరీరానికి “ఆర్కిటెక్చరల్ బ్లూప్రింట్”(Architectural Blueprint) గా అభివర్ణించిన ఆమె, సరైన పోశ్చర్ వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. నిలబడేటప్పుడు బరువును మడమలపై ఉంచి, ఛాతీని పైకి ఎత్తి, భుజాలను వెనక్కి తిప్పి, గడ్డాన్ని నేలకు సమాంతరంగా ఉంచడం ద్వారా వెన్నెముకను నిటారుగా ఉంచవచ్చని చెప్పారు. నడిచేటప్పుడు చేతులను వెనక్కి కట్టి మోచేతులను పట్టుకోవడం వెన్నుముకకు మద్దతు ఇస్తుందని, అలాగే కూర్చునే సమయంలో వెన్నుపాము వంపు వద్ద కుషన్ ఉంచుకోవడం సౌకర్యంగా ఉంటుందని సూచించారు.
పోశ్చర్ మెరుగుపరచడానికి ఆమె రెండు ముఖ్యమైన వ్యాయామాలను సూచించారు. మొదటిది, గోడకు చేతి దూరంలో నిలబడి, అరచేతులను గోడపై వీలైనంత ఎత్తులో ఉంచి, శరీరాన్ని నేలకు సమాంతరంగా వంచాలి. ఈ స్థితిలో ఒక నిమిషం పాటు ఉండటం వల్ల వెన్నుకు ఉపశమనం లభిస్తుంది. రెండో వ్యాయామంలో భాగంగా, గోడకు సమాంతరంగా నిలబడి చేతులతో వృత్తాకారంగా భ్రమణం చేస్తూ శరీరాన్ని వెనక్కి తిప్పాలి. ఇది వెన్నెముక కదలికలను మెరుగుపరుస్తుంది. బలమైన వెన్నుముక సరైన శ్వాస, చురుకుదనం కోసం అవసరమని, మొదట్లో కష్టంగా అనిపించినా సాధనతో మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆమె పేర్కొన్నారు. వెన్నెముక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం సంపూర్ణ ఆరోగ్యానికి పునాది అని నిపుణులు సూచిస్తున్నారు.

