కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ వ్యాపార వర్గాల్లో ఒక వార్త తీవ్ర దుమారం రేపుతోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు వచ్చిన సుమారు రూ. 16,000 కోట్ల (1.7 బిలియన్ డాలర్లు) భారీ ఆఫర్‌ను ఆ జట్టు యాజమాన్యం సున్నితంగా తిరస్కరించింది. కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (CPCP) అనే కన్సార్టియం ఈ బిడ్‌ను దాఖలు చేసినట్లు సమాచారం. తమ ఫ్రాంచైజీ విలువ భవిష్యత్తులో మరిన్ని రెట్లు పెరుగుతుందనే నమ్మకంతో రాజస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యూఎస్, కెనడాలకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ సీపీసీపీ, కేవలం రెండు వారాల్లోనే పూర్తి సొమ్మును చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ వ్యవస్థాపక భాగస్వాములు నిశా సచ్‌దేవ, దుబ్జీత్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగినా రాజస్థాన్ రాయల్స్ బోర్డు మాత్రం ససేమిరా అంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో ఎమెర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలెకు 65 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా రెడ్‌బర్డ్ క్యాపిటల్ వద్ద ఉంది. వీరు ఆశించిన స్థాయిలో విలువ లేకపోవడంతోనే ఈ డీల్ పట్టాలెక్కలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మరో పాపులర్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విలువను ఒక్కసారిగా పెంచేసింది. రాజస్థాన్‌కే 16 వేల కోట్ల ఆఫర్ వస్తే, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ విలువ రూ. 20,000 కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్సీబీకి ఉన్న క్రేజ్, డిజిటల్ వ్యూయర్‌షిప్ దృష్ట్యా రాజస్థాన్ బిడ్ కంటే కనీసం 20 శాతం అదనపు ధర పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పాయ్ సారథ్యంలోని కన్సార్టియం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ (IPL 2026) జట్ల అమ్మకాలు ఇలా రికార్డు స్థాయి ధరలను తాకడం లీగ్ ఆర్థిక బలాన్ని చాటిచెబుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఫ్రాంచైజీల తుది విలువ ఎంత వద్ద స్థిరపడుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

