కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్ (Jharkhand Accident) రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్రా-తోర్పా రహదారి మార్గంలో అతివేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రహదారి పక్కన నిలబడి ఉన్న జనంపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ప్రమాదానికి కొద్దిసేపటి క్రితం అదే ప్రాంతంలో ఒక స్కూటీ బోల్తా పడి పక్కనే ఉన్న పొదల్లో పడిపోవడంతో స్థానిక గ్రామస్థులు, మహిళలు, పిల్లలు సహాయం చేయడానికి, ఏం జరిగిందో చూడటానికి రోడ్డు పక్కన గుమిగూడారు. అదే సమయంలో తోర్పా వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డుపై ఉన్న జనాలవైపు తీసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు

