కలం, అయోధ్య: కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) విరాళాల వ్యవహారం దుమారం రేపుతున్నది. ఆలయ హుండీ కానుకలు, విరాళాల లెక్కల్లో సుమారు రూ.7.5 కోట్ల మేర తేడాలు రావడం, ఆలయ ఉద్యోగి నివాసంలో భారీగా నగదు రికవరీ లాంటి ఘటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. నిందితులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఇదే క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. నగదు లెక్కింపు విభాగంలో పనిచేసే అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాతో సహా ఎనిమిది మంది ఆలయ సిబ్బందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
నృపేంద్ర మిశ్రా వ్యాఖ్యలతో..!
అయోధ్య విరాళాల వివాదంపై జూన్ 19న రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మొదటిసారిగా స్పందించారు. ‘‘రామ మందిర నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకున్న సమయంలో వివాదం నెలకొనడం నన్ను కలిచివేసింది. ఈ అక్రమాల ఆరోపణలు దేశవిదేశాల్లోని కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆలయ పరిపాలనా విభాగాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆలయ ప్రస్తుత అంతర్గత పరిపాలన అంతా అనధికారికంగా సాగుతున్నది.
ప్రస్తుత నిర్వహణ వ్యవస్థలో పర్యవేక్షణ, జవాబుదారీతనం పూర్తిగా లోపించాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే రామాలయ యాజమాన్య నిర్మాణాన్ని తక్షణమే పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఆలయ నిర్వహణ బాధ్యతలను అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అన్నారు.
నృపేంద్ర మిశ్రా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆలయ నిర్మాణ నాణ్యత, గర్భగుడిలోకి వర్షపు నీరు చేరడంపై చేసిన వ్యాఖ్యలు అయోధ్యలో పరిణామాలు వేగంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించగా, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, నిర్మాణ సంస్థలు తక్షణమే స్పందించాయి. సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగి గర్భగుడి పైకప్పు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. భక్తుల్లో ఎలాంటి ఆందోళన కలగకుండా ఉండేందుకు ట్రస్ట్ ప్రతినిధులు ఆలయ భద్రత, నాణ్యతపై ఎప్పటికప్పుడు వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విరాళాల సేకరణ, లెక్కింపునకు సంబంధించి 2023 నుంచి 2025 మధ్య జారీ చేసిన పత్రాలను ఆలయ ఉన్నతాధికారులు పరిశీలించినట్లు తెలుస్తున్నది.
ఎనిమిది మంది అరెస్ట్
– అయోధ్యలోని రామాలయ (Ayodhya Ram Mandir) విరాళాలు, విలువైన వస్తువుల లెక్కింపులో అక్రమాలకు పాల్పడినట్లు నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
– ఆలయ విరాళాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక నివేదికను సమర్పించిన రెండు రోజులకే ఈ అరెస్టులు జరిగాయి.
– శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అరెస్ట్ అయిన వారిని రాంశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను, లవ్‌కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రమాశంకర్ మిశ్రా, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేష్ పాండేగా గుర్తించారు.
– ఆలయ ప్రాంగణంలోని హుండీల ద్వారా సేకరించిన నగదును లెక్కిస్తున్న సమయంలో వీరు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద దొంగతనం, నమ్మకద్రోహం, చీటింగ్, నేరపూరిత కుట్ర లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మూడు రోజుల రిమాండ్కు తరలించారు.
– ఈ కేసులో ప్రాథమిక విచారణలో భాగంగా సిట్ బృందం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ ఇన్‌ఛార్జ్ గోపాల్ రావును ప్రశ్నించినప్పటికీ.. ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను చేర్చలేదు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీ.. విరాళాల సేకరణ, నగదు లెక్కింపునకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించింది. ఆలయ ఉద్యోగులను, అధికారులను విచారించిన అనంతరం ఈ నివేదికను అందించింది. ఈ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభిస్తే మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
చంపత్ రాయ్ రాజీనామా
అయోధ్యలోని టెంపుల్ కానుకల లెక్కింపులో భారీగా నగదు గోల్‌మాల్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆలయంలో సుమారు రూ.7 కోట్ల నుంచి 7.5 కోట్ల మేర నగదు మాయమైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
రాజకీయ దుమారం
అయోధ్య ఆలయంలోని (Ayodhya Ram Mandir) విరాళాల స్కామ్ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ఎఫ్‌ఐఆర్ లో ట్రస్ట్ సీనియర్ ఉన్నతాధికారుల జవాబుదారీతనాన్ని దాటవేశారని, తక్కువ స్థాయి సిబ్బందిని మాత్రమే టార్గెట్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ‘నైతిక ప్రాతిపదికన’ రాజీనామాలు చేయిస్తూ.. వెనుక ఉన్న ప్రభావవంతమైన వ్యక్తులను ప్రభుత్వం రక్షిస్తోందని సమాజ్‌వాదీ ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్ విమర్శించారు. దర్యాప్తు పక్షపాతంగా సాగుతోందని ఆయన వ్యాఖ్యలు చేయడం మరింత వివాదానికి దారితీస్తోంది.
సహించేది లేదు: యోగి
విరాళాల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. సిట్ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించిందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. డియోరియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయోధ్య నగరం సనాతన ధర్మానికి, కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీక అని అన్నారు.
నిజానిజాలను త్వరలోనే పూర్తిగా వెలికితీస్తామని, రామ్ భక్తుల నమ్మకాలతో ఆడుకునే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై సీఎం యోగి (CM Yogi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారి గత చరిత్రను గుర్తుచేస్తూ… ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే ప్రశ్నిస్తూ కోర్టుల్లో లాయర్ల సైన్యాన్ని నిలిపి, మందిర నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు.
ట్రస్ట్ రియాక్షన్
విరాళాల వివాదం ఆరోపణలను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ తీవ్రంగా ఖండించింది. మందిర నిర్మాణ నిధుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయని ట్రస్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కేవలం మందిర ప్రతిష్టను దెబ్బతీయడానికి, భక్తుల్లో గందరగోళం సృష్టించడానికే కొందరు కావాలని బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. విరాళాల వివరాలన్నింటినీ త్వరలోనే ఆడిట్ నివేదిక ద్వారా బహిర్గతం చేస్తామని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.
Read Also: సింగూరు డెడ్ స్టోరేజీ.. సిటీకి నీళ్లెలా?
Follow Us On: Instagram

