కలం, తెలంగాణ బ్యూరో: “సంక్షేమ పథకాల (Welfare Schemes)ను అమలు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం.. ఆ పథకాలను రూపకల్పన చేసి అమలు చేయడమే కాక ఏయే పథకాల ద్వారా ప్రజలకు ఎంత లబ్ధి చేకూరుస్తుందో గ్రామసభలు నిర్వహించి మరీ ప్రజలకు వివరించాలి. రుణమాఫీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి అర్హులందరికీ చేరేలా చూడాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మార్చి నెల ఫస్ట్ వీక్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. దాదాపు మూడు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో ప్రోగ్రెస్ లేదని సీఎం గ్రహించారు.
ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా బురదజల్లేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారం చేస్తున్నా దానికి ప్రభుత్వం తరఫున వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారాన్ని చేపట్టకపోవడం సీఎంవో స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డిజిటల్ మీడియా పబ్లిసిటీని మరింత పెంచేందుకు, కమ్యూనికేషన్ వ్యవస్థను రీ ఆర్గనైజ్ చేసేందుకు సిద్ధమైంది. దీనిపైనే తాజాగా మంత్రుల పీఆర్వోలు, డిపార్ట్మెంట్ల పీఆర్వోలతో (PROs) ప్రభుత్వం చర్చించింది.
అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేండ్ల టైమ్ ఉండటంతో ఇప్పటి నుంచే పటిష్టమైన ప్రచార వ్యవస్థను సెట్ చేసుకునే పనిలో పడింది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చేసిన దానికన్నా చెప్పుకున్నదే ఎక్కువ అనే తీరులో వ్యవహరించిందని, తాము చేస్తున్నా ఎందుకు చెప్పుకోలేకపోతున్నామని పీఆర్వోల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇకపైన ప్రతిరోజూ ప్రతి అంశంపైనా పీఆర్వోల సమన్వయంతో పాటు వాస్తవాలను ప్రజలకు చెప్పడం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం అనే విధానం కొనసాగాలన్నది ఈ సమావేశంలో నిర్ణయించారు.
పటిష్టమైన యంత్రాంగం ఉన్నా ఆధునిక ప్రచార, ప్రసార వనరులను వాడుకోలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. గడిచిన రెండున్నరేండ్లుగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటి ఫలాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామనే అంచనాకు వచ్చింది. దీంతో సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ ద్వారా అన్ని విభాగాల పీఆర్వోలు, మంత్రుల పీఆర్వోలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓరియంటేషన్ ఇచ్చింది.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేసేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించింది. విపక్షాలు చేస్తున్న విమర్శలకు వాస్తవ గణాంకాలతో కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేసింది. రెండున్నరేండ్లుగా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఆ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోవడంలో వైఫల్యం ఉందని ఆ సమావేశంలో ప్రస్తావించింది. ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నది.
ప్రతిపక్షాల ఢీకొట్టడంలో మరింత వేగం
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా దాని ద్వారా ఆశించిన స్థాయిలో పార్టీకి పాపులారిటీ దక్కడం లేదని కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. ఇందుకు సరైన ప్రచారం లేకపోవడమే కారణమని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం ఇన్‌ఫార్మల్ మీటింగుల్లో పార్టీ నేతలతో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రజా ప్రతినిధులు కూడా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల కంటే వాటి ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందిందని, కానీ కాంగ్రెస్ (Congress) ఆ విషయంలో విఫలమవుతున్నదనే అభిప్రాయం హస్తం పార్టీలో నెలకొన్నది.
ఇటు ప్రభుత్వ విజయాలను చెప్పుకోలేక, అటు విపక్షాల విమర్శలకు దీటుగా వేగంగా సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదనేది ప్రభుత్వంతోపాటు పార్టీ భావన. ఎన్నికలకు రెండున్నరేండ్ల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యవస్థను రూపొందించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయానికి వచ్చింది. సంప్రదాయ మీడియాతో పాటు సోషల్ మీడియాను ప్రధాన రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నది.
సీఎం సీపీఆర్వో ఆఫీస్ ద్వారా సమన్వయం
ప్రతిపక్షాలు అసత్యాలతో విష ప్రచారం చేస్తున్నప్పుడు వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు వీలుగా ఆయా మంత్రిత్వశాఖలు, డిపార్టుమెంట్ల నుంచి గణాంకాలను తెప్పించుకుని విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని పీఆర్వోల సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇలాంటి గణాంకాలను తెప్పించుకోడానికి సీఎం పీఆర్వో కార్యాలయం సమన్వయకర్తగా వ్యవహరించనున్నది. తాజాగా జరిగిన ధాన్య సేకరణ అంశం పీఆర్వోల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
గత ప్రభుత్వం కంటే భారీ స్థాయిలో ధాన్యాన్ని కొనడంతో పాటు తక్కువ వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినా.. దీన్ని పెద్దగా చెప్పుకోలేకపోయామని పీఆర్వోలకు ప్రభుత్వం గుర్తు చేసినట్లు తెలిసింది. విపక్షాలు కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడించి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టడంలో ఎందుకు విఫలమయ్యామని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక నుంచి సమగ్ర సమాచారంతో దీటుగా కౌంటర్ ఇవ్వాలని పీఆర్వోలకు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
బలమైన మెసేజ్ ఇచ్చేలా..!
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సోషల్, డిజిటల్ మీడియా ప్రచారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు బస్సులకు మహిళలనే ఓనర్లుగా చేయడం వరకు రెండున్నరేండ్లలో కాంగ్రెస్ సాధించిన విజయాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన ‘నెరేటివ్’ రూపొందించడంపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తే ప్రజల్లోకి అంతే స్పీడ్‌గా వెళ్తుందని పీఆర్వోల సమావేశంలో సీఎం సీపీఆర్వో విభాగం స్పష్టత ఇచ్చింది.
ఇకపైన ప్రతిరోజూ ప్రతి అంశంపైనా పీఆర్వోల సమన్వయంతో పాటు వాస్తవాలను ప్రజలకు చెప్పడం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం అనే విధానం కొనసాగాలన్నది ఈ సమావేశంలో కీలక నిర్ణయం. ఇంకోవైపు ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే కేవలం ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు సరిపోవనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల నుంచి వ్యక్తమవుతున్నది. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, లబ్ధిదారుల అనుభవాలు, పారదర్శకత, గణాంకాలతో కూడిన సమాచారాన్ని, సక్సెస్ స్టోరీలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ప్రభావం ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.
Read Also: సింగూరు డెడ్ స్టోరేజీ.. సిటీకి నీళ్లెలా?
Follow Us On : WhatsApp

