కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: నేడు ప్రపపంచ పొగాకు వ్యతిరేక దినం (World No Tobacco Day) సందర్భంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా.కృష్ణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పుర వీధుల గుండా శిల్పరామం వరకు కొనసాగింది. అక్కడ మానవ హారంగా ఏర్పడి పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీని ఉద్దేశించి డా. కృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ కారకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం “Unmasking the appeal: countering nicotine and tobacco addiction” (నికోటిన్, పొగాకు వ్యసనాన్ని తిప్పికొట్టడం) అని తెలియజేశారు. సిగరెట్లు, బీడీలు, హుక్కా, గుట్కా, ఖైనీ, జర్దా వంటి వాటిలో నికోటిన్ ఉంటుంది. ఇది మనిషిని త్వరగా వ్యసనపరుడిగా మారుస్తుంది. పొగాకు వాడకం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ( Lung Cancer), నోరు, గొంతు క్యాన్సర్లు, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. పొగ తాగడం కంటే పొగాకు నమలడం వల్ల 30 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్:
ధూమపానం చేసే వారే కాకుండా, వారి పక్కన ఉండి పొగ పీల్చే కుటుంబ సభ్యులు (ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు) కూడా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పొగాకు అలవాటును వదిలేయడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గడంతో పాటు గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డా.శశికాంత్ , చైల్డ్ హెల్త్ ఇమ్మ్యూననైజేషన్ అధికారి డా. పులి విద్య, డా.విజయ్ , డా.మమత ,హెల్త్ ఎడ్యుకేటర్లు నాగరాజు శెట్టి, హన్మంతు,నాగరాజు, సీహెచ్‌వో వరమ్మ, అశోక్ రాజు, డీపీవో సీతారాము, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

