కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన (Auto Drivers Protest) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్నటి వరకు ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టగా, నేడు ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఈ క్రమంలో ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆటో మీటర్ ఛార్జీలను తక్షణమే పెంచాలని, అలాగే ఇతర జిల్లాల ఆటోలకు హైదరాబాద్ నగరంలోకి అనుమతి ఇవ్వకూడదని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రైవర్లు చేపట్టిన ఈ ధర్నా సుమారు గంటకు పైగా కొనసాగడంతో పరిసర ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎంజే మార్కెట్ కూడలిలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ను అడ్డుకున్న తోటి కార్మికులు, పోలీసులు అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ అనూహ్య ఘటనతో అబిడ్స్, కోటి, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: కవిత పార్టీపై తెలంగాణ బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!
Follow Us On : WhatsApp

