కలం, నిజామాబాద్ బ్యూరో: ఫిక్సిడ్ వేతనం రూ.18వేలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్లో ఆశా వర్కర్లు (ASHA Workers Protest) కదం తొక్కారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి వందలాది మంది ఆశా వర్కర్లు కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించటం లేదని సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. పని భారం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి చాలీచాలని పారితోషికాలతో ఆశాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశాలకు ఫిక్డ్స్ వేతనం రూ.18వేలుగా నిర్ణయించి అశాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దీనికి భిన్నంగా ప్రభుత్వం అదనంగా చెల్లించే డబ్బులు కూడా ఎగ్గొట్టాలని చూడటం అన్యాయమని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీ చేసిన ఆశాలకు చాలా జిల్లాల్లో డబ్బులు ఇంకా చెల్లించలేదని గుర్తు చేశారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లెప్రసీ సర్వే చేయాలని అన్ని జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఆశాలను ఆదేశిస్తున్నారనీ చెప్పారు. ఈ సర్వేకు అదనంగా డబ్బు చెల్లిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. సర్వేకు డబ్బు చెల్లించాలని పై నుంచి ఆదేశాలు రాలేదని కొన్ని జిల్లాల్లో అధికారులు అంటున్నారని చెప్పుకొచ్చారు. మరికొన్ని జిల్లాల్లో సర్వే చేయండి, తర్వాత చూస్తామని అంటున్నారనీ.. జిల్లాకో రకంగా అధికారులు స్పష్టత లేని సమాధానాలు చెప్తున్నారని విమర్శించారు.
ఏటా లెప్రసీ సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ఆశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, అదనపు డబ్బులు చెల్లించకుండా మోసం చేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుడు లెప్రసీ సర్వేకు అదనపు డబ్బు చెల్లింపు కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు. ఆ పోరాటం సందర్భంగా లెప్రసీ సర్వే డబ్బుతోపాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల (ASHA Workers Protest) నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు, సుకన్య, బాలామణి, రమ, ఇందిర, రేఖ, రేణుక, శాంతి, విజయ, నీలోఫర్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: వెండికి కూడా హాల్ మార్కింగ్..! కేంద్రం నయా ప్లాన్
Follow Us On: Instagram


