కలం, డెస్క్ : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బీఆర్ ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ను కూడా ఖతం చేయాలి. అప్పుడే తెలంగాణకు మంచి జరుగుతుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య జరుగుతున్నాయి. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఓటేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ ఇస్తా అన్నారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. తులం బంగారం, మహిళలకు రూ.2500 కూడా ఇవ్వట్లేదు. యువత మొత్తానికి ఉద్యోగాలిస్తానని మోసం చేశారు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ ఎస్ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో నిండా మోసం చేశారని.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మాటలు కోటలు దాటినా.. పనులు మాత్రం ఏమీ జరగట్లేదని తెలిపారు కిషన్‌రెడ్డి . బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు గానీ.. పేదలకు మాత్రం ఏం న్యాయం చేయట్లేదని తెలిపారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను మాత్రమే గెలిపించి ఆ రెండు పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి సింగరేణి కార్మికుల డబ్బు రూ.51వేల కోట్లు దోచుకున్నాయని కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టులు మొత్తం కాంగ్రెస్ నేతలకే దక్కుతున్నాయని.. అంతకు ముందు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని చెప్పారు. అలాంటి పార్టీలకు సింగరేణి బెల్ట్ లో బుద్ధి చెప్పాలని కోరారు.
Read Also: కస్టోడియన్‌గా వ్యవహరించాలి… బ్యాంకులకు సుప్రీం ఆదేశం
Follow Us On : WhatsApp


