కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిని , అలాగే వైసీపీ ప్రస్తావించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) విధానాన్ని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాజధాని ఎలా ఉండాలో వివరిస్తూ.. ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజధానికి అతిపెద్ద ల్యాండ్ బ్యాంకులు, అప్పులు అవసరం లేదని చెప్పారు. ముందుగా శాసనసభ, సచివాలయం, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఢిల్లీ తరహా రాజధాని అవసరం..
ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ తరహా రాజధాని అవసరం అని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఏనాడూ ఒకేసారి అప్పులతో నిర్మితం కాలేదని, దశాబ్దాల కాలంలో అవసరాలకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి చెందిందని చెప్పారు. 1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల (సుమారు 10,550 ఎకరాలు) విస్తీర్ణంలో ఢిల్లీ నగరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. 1931లో నిర్మాణం పూర్తయ్యే నాటికి రూ.10 కోట్లు ఖర్చు అయిందని.. ప్రస్తుతం విలువ ప్రకారం ఇది రూ. 10,000 కోట్లకు సమానం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఢిల్లీ తరహాలో దశలవారీగా అభివృద్ధి చెందాలని సూచించారు. కానీ కూటమి ప్రభుత్వం దీనికి బిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
అప్పులతో రాజధాని నిర్మిస్తే ఆర్థిక ఆత్మహత్యే..
అమరావతిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.1.5 లక్షల కోట్ల అంచనాతో పూర్తిగా అప్పులపై ఆధారపడి నిర్మించడం ఆర్థికంగా వివేకవంతం కాదని అభిప్రాయపడ్డారు. కేవలం అప్పులపై ఆధారపడి లక్షల కోట్ల రూపాయల అంచనాలతో రాజధానిని నిర్మించాలనుకోవడం ఆర్థిక ఆత్మహత్యే అవుతుందన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిలో రైతులకు ఇస్తామన్న అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదని, భూసేకరణ చట్టం-2013 ప్రకారం అదనపు పరిహారం కూడా అందించలేదని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. పేదలకు కేటాయించిన 50,000 ప్లాట్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.
‘మావిగన్’ తో ముప్పు తప్పదు..!
వైసీపీ ప్రతిపాదించిన ‘మావిగన్’ తో ముప్పు తప్పదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ ప్రతిపాదన వల్ల పరిపాన వికేంద్రికరణ కాకుండా, విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రయోగాలు చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుందని, ఫలితంగా ఏపీకి వచ్చే పెట్టుబడులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రాజధాని అనేది పరిపాలనకు నాడీకేంద్రంలా ఉండాలని సూచించారు. గందరగోళానికి వేదికగా రాజధాని నిర్మాణం చేపట్టవద్దని హితవు పలికారు.

