కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్న తరుణంలో రాజకీయ నాయకుల నుంచి కల్వకుంట కవితకు భారీగా మద్దతు లభిస్తోంది. తాజాగా తెలంగాణ జాగృతిలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ (Rathod Bapurao) చేరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. జాగృతిలోకి చేర్చుకున్నందుకు రాథోడ్ బాబురావు కవితకు ధన్యవాదాలు తెలిపారు. జాగృతి అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని చెప్పారు. అటు తెలంగాణ జాగృతి లీగల్ సెల్ అధ్యక్షులు అప్పల నరేందర్ ఆధ్వర్యంలో పలువురు అడ్వకేట్లు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవితవారికి కండువా కప్పి వారిని జాగృతిలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి తమ కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కవిత వెల్లడించారు. 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ కుటుంబంతో వారం రోజులు ఉండి హెల్త్ క్యాంపు పెట్టినట్లు కవిత గుర్తు చేశారు. రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని కొనియాడారు. బాపూరావు జాగృతి ద్వారానే బీఆర్ఎస్‌లో చేరారని, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. బాపురావుతో సహా తెలంగాణలో ఉన్న ఉద్యమకారులంతా కొత్త పార్టీ వైపు చూస్తున్నారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ పార్టీకి తప్పకుండా ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమకారులంతా ఒక్కటి కావాలని, తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసినట్లే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని కోరారు. ఇదే వేదిక మీద నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి జాగృతిలో చేరుతున్న వారికి స్వాగతం పలికారు.
ఇక 2018 ఎన్నికల్లో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రాథోడ్ బాపురావ్ గెలిచి పాలన చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఏప్రిల్ 2024లో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బాపురావు.. తాజాగా తెలంగాణ జాగృతిలో చేరారు. బోథ్ నియోజకవర్గంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా బాపురావుకు గుర్తింపు ఉంది.
అంతకుముందు జాగృతి అధ్యక్షురాలు కవితతో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ ఆల్ ఇండియా చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య భేటీ అయ్యారు. జనగణనలో ఆదివాసీల మతం చెప్పుకునేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు కవితకు వివరించారు. ఆదివాసీల హక్కుల కోసం జేఏసీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఉంటుందని కవిత ప్రకటించారు.

