కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి(Amaravati)పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పేరును ఇంగ్లీష్ లో కొన్ని చోట్ల Amaravathi అని రాస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాజధాని అమరావతి ఇంగ్లీష్ స్పెల్లింగ్ పై కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని అధికారిక పత్రాలు, నోట్స్‌లలో ఇక నుంచి రాజధాని పేరును Amaravati అనే స్పెల్లింగ్‌తో ఉపయోగించాలని స్పష్టం చేసింది. కొన్ని చోట్లలో వాడుకలో ఉన్న Amaravathi సరికాదని వెల్లడించింది.’thi’కి బదులుగా ‘Ti’ ఉండాలని.. Amaravati అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వినియోగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలాఉంటే రాజధాని అమరావతికి ఇటవలే చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన కేంద్రానికి పంపించగా.. పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి చట్టబద్దత బిల్లుకు అభయసభలు ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణ చేసి రాజధాని స్థానంలో అమరావతిని చేర్చారు.

