కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అన్ని వర్గాల ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ఉద్యమ ఆశయాల అమలుపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మాజీ ఏపీవీసీసీ చైర్మన్, మాజీ ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ (Bakka Judson) డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు డా. కె. కేశవరావు (కేకే), సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి లకు ఆయన ఒక సుదీర్ఘ బహిరంగ వినతిపత్రాన్ని అందజేశారు.
నియామకాలపై నిరుద్యోగుల్లో ఆవేదన
తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని నమ్మి విద్యార్థులు, నిరుద్యోగులు ఆనాటి ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడారని బక్క జడ్సన్ గుర్తు చేశారు. గ్రూప్–1 పరీక్షల సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పరీక్షలు రాస్తామని చెబుతూ ప్రశ్నాపత్రాలను చించి “జై తెలంగాణ” నినాదాలతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చిన సంఘటనలు ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని చెప్పారు.
అయితే రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 గ్రూప్–1 పరీక్షల వివాదాలు, 2022 ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అధికారమైందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 3.50 లక్షల ఖాళీలు ఉన్నా భర్తీ ప్రక్రియ మందగించిందని, ఎన్నికల సమయంలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘నీళ్లు–నిధులు’ ఎటు పోయాయి?
“నీళ్లు–నిధులు–నియామకాలు” అనే ఉద్యమ నినాదంలో “నిధులు” అంశంపై కూడా ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని జడ్సన్ తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి భారీ ప్రాజెక్టుల వ్యయాలు, అప్పులు, నిధుల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన సాంకేతిక వైఫల్యాలు, మునిగిపోయిన భారీ పంపుల కారణాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై ప్రభుత్వం సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
అలాగే ఉద్యమ సమయంలో రైతుల నుండి సేకరించిన వేల ఎకరాల భూములను పరిశ్రమల పేరుతో వివిధ సంస్థలకు కేటాయించారని గుర్తు చేసిన ఆయన.. ఆ భూములపై ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు, వినియోగం కాని భూముల పరిస్థితి ఏమిటి అనే అంశాలపై పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా ఏది?
సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్లతో ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 డీఏలు పెండింగ్లో ఉండటం, కొత్త పీఆర్సీ అమలు కాకపోవడం బాధకరమన్నారు. సీపీఎస్ రద్దు హామీని నెరవేర్చాలని కోరారు. ఇక ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైమ్, గెస్ట్ ఉద్యోగులు నేటికీ ఏజెన్సీల దోపిడీకి గురవుతూ, సకాలంలో జీతాలు అందక దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పారు. వారికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించేలా కమిటీ సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కళాకారులు, అడ్వర్టైజింగ్ రంగాలకు దక్కని గుర్తింపు..!
ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన స్థానిక అడ్వర్టైజింగ్ (ప్రకటన) రంగానికి రాష్ట్రం వచ్చిన తర్వాత ఆశించిన అవకాశాలు దక్కలేదని బక్క జడ్సన్ (Bakka Judson) తెలిపారు. ఈ రంగంలో స్థానికులకు న్యాయం జరిగేలా విధానపరమైన చర్యలను కమిటీ పరిశీలించాలని కోరారు. అదేవిధంగా ఉద్యమానికి ఊపు తెచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్ర దర్శకుడు శంకర్ జాడే వంటి సాంస్కృతిక యోధులకు తగిన గౌరవం, ప్రోత్సాహం అందేలా చూడాలని కమిటీని వినమ్రంగా కోరుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమ ఆశయాలను సంపూర్ణంగా అమలు చేసినప్పుడే అమరుల త్యాగాలకు, ఉద్యమకారుల పోరాటానికి నిజమైన గౌరవం దక్కుతుందని బక్క జడ్సన్ తెలిపారు. ఈ మేరకు తాను డిమాండ్ చేస్తున్న అంశాలను కమిటీ అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులు చేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
Follow Us On: X(Twitter)

