కలం, వెబ్ డెస్క్: మున్సిపాలిటీల్లో రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం మున్సిపల్ కార్మికుల విధి. రోజూ ఉదయాన్నే కార్మికులు ఇంటింటా చెత్త సేకరిస్తూ, పట్టణ పరిసరాలు నీట్‌గా ఉంచేలా పర్యవేక్షించడం అధికారుల బాధ్యత. ఇక ఇద్దరూ తమ విధులు, బాధ్యతలకు తిలోదకాలిస్తే ప్రజలు ఏం చేయాలి? చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతూ మౌనంగా ఉండాలా? ఆ ప్రజలు అలా ఉండాలనుకోలేదు. తమ సమస్య అధికారులకూ అనుభవం కావాలనుకున్నారు. అంతే వెంటనే ఇంట్లో ఉన్న చెత్తను ప్యాక్ చేసి మున్సిపల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad) మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 21వ వార్డులో గత వారం రోజులుగా చెత్త తొలగించడం లేదు. దీంతో ఆగ్రహించిన ప్రజలు తమ ఇంటి చెత్తను తామే ఊడ్చి బకెట్‌లలో, సంచుల్లో చేత పట్టుకొని మున్సిపల్ కార్యాలయంలోని ప్రతి సెక్షన్ రూములో వేసి నిరసన తెలిపారు. మున్సిపల్ ట్యాక్స్‌లు కట్టించుకుంటారు కానీ చెత్త తొలగింపులో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రజలు ప్రశ్నించారు. ఎందుకు చెత్త సేకరణ కోసం బండ్లు పంపండం లేదని అధికారులను ప్రశ్నించారు. మీ ఇంట్లో ఇలా చెత్త పెట్టుకుంటారా? అని నిలదీశారు. దీంతో ప్రజలకు, అధికారులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

