కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ఏసీబీ (ACB) అధికారుల వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న మున్సిపల్ ఏఈని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ (Huzurabad) మున్సిపల్ ఏఈ నుసుం సుధాకర్ రెడ్డి బుధవారం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సుధాకర్ రెడ్డి హుజురాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఫిర్యాదు దారుడు మున్సిపల్ పరిధిలో చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణ పనులకు సంబంధించి మెజర్మెంట్ బుక్ నమోదు చేసి తుది బిల్లును ప్రాసెస్ చేయడానికి సహకరించాలని కోరారు. అందుకు ఏఈ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. బిల్లు క్లియరెన్స్ కోసం ఏఈ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు హుజురాబాద్ ఆర్టీసీ బస్ డిపో చౌరస్తా వద్ద లంచం తీసుకుంటుండగా దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ అవినీతి జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని కోరారు. వాట్సాప్ 94404 46106 లోనూ సంప్రదించవచ్చని సూచించారు.

