కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న ఆర్టీసీ హమాలి కార్మికులకు ఆర్టీసీ సంస్థలో ఎలాంటి గుర్తింపు, భద్రత లేదని తక్షణమే వారిని ఆర్టీసీ సంస్థ ఉద్యోగులుగా ఆర్టీసీ హమాలీ కార్మికుల (TGSRTC Hamali Workers) ను గుర్తించాలని ఏఐటీయూసీ (AITUC) జిల్లా కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ కార్గో హమాలి కార్మికుల సమావేశం జరిగింది. అనంతరం సెప్టెంబర్ 6,7,8 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల ప్రచార స్టిక్కర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు తగిన కూలి రేట్లు లేక కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థలు హమాలి వ్యవస్థను ప్రైవేట్ ఏజెన్సీ గుత్తేదారులకు అప్పజెప్పడం చేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ హమాలీ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆర్టీసీ ఆధీనంలో హమాలి వ్యవస్థ ఉన్నప్పుడు 50 కిలోల బరువు వస్తువులకు పది రూపాయలు చెల్లించేదని ప్రైవేట్ ఏజెన్సీలు వచ్చిన తర్వాత హమాలి కూలి రేట్లు నిర్ణయించి అమలు చేయడంలో పారదర్శకత లోపించిందని అన్నారు.
పేరుకే ఆర్టీసీ సంస్థ అని కానీ ఆర్టీసీ హమాలీ కార్మికులకు ఎలాంటి హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా లేవని అన్నారు. కూలి రేట్లు 20 రూపాయలకు పెంచాలని ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేయాలని, హామాలి కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పించాలని, విశ్రాంతి గది కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 6న ఛలో కరీంనగర్‌కు పెద్ద ఎత్తున కార్మికుల తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో కార్గో హమాలీ కార్మికులు రాములు, ఆంజనేయులు, నరేష్, గిరి, మూర్తి, రవి, సుధీర్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

