కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ ప్రభుత్వ భూములు (Ailapur Lands) స్వాధీనం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినది. ఈ భూములు అనేక న్యాయ వివాదాల్లో నలుగుతూ వస్తోంది. నిజాం కాలం నుండి మొదలైన భూవివాదం నేటికి కొనసాగుతోంది. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న వేలాది కోట్ల విలువైన భూములపై ఏళ్లకు ఏళ్లు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఐలాపూర్ భూముల వివాదం ఎప్పుడు ముగియనుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఐలాపూర్ భూముల వివాదం ఏంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
దశాబ్దాలుగా కొనసాగుతున్న చిక్కులు..
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని 1 నుంచి 220 సర్వే నంబర్ల వరకూ 1263 ఎకరాల ప్రభుత్వ భూమి (Ailapur Lands) ఉంది. ఈ భూమి నిజాం పాలకులకు చెందినది కాగా.. హైదరాబాద్ సంస్ధానం విలీన ప్రక్రియ తరువాత ప్రభుత్వ భూమిగా రికార్డులకెక్కింది. అయితే, ఈ భూముల పైన దశబ్ధాలుగా న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, న్యాయవాది ముఖీం, రైతులు, మరో కుటుంబం ఈ భూములపై హక్కులు తమవి అంటే తమవి అంటూ కేసులు వేశారు. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ (W.A.No.10/98 & ఇతర కేసులు తేదీ: 04.07.2003 ) ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అప్పటి జాయింట్ కలెక్టర్ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. 1980 దశకంలో అక్కడ రెండు లే ఔట్‌లు వచ్చాయి. 495 ఎకరాలతో రాజగోపాల్‌నగర్ కాలనీ, 131 ఎకరాలతో విద్యుత్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లు ఏర్పడ్డాయి. కాగా, 1263 ఎకరాల భూమిలో 475 ఎకరాలు తమవి అంటూ ఓ కుటుంబం పట్టాలను చూపిస్తూ వస్తోంది. వీరంతా కోర్టును ఆశ్రయించి తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.
మరోవైపు వివాదానికి కేంద్రంగా ఉన్న ఐలాపూర్ భూములను అనుభవిస్తున్న న్యాయవాది ముఖీం తండ్రి నిజాం పాలకుల దివాన్ దగ్గర పని చేసేవాడని.. దివాన్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 19 ఎకరాల భూమి ముఖీం తండ్రికి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. వాస్తవానికి దివాన్ ఇచ్చింది కుడా ప్రభుత్వ భూమే అయినప్పటికీ.. ముఖీం తండ్రికి చెందిన 19 ఎకరాల భూమిలో కూడా లే ఔట్ వేసి అమ్మేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆ 19 ఎకరాలతో పాటు.. మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించినట్టు అక్కడి లే ఔట్ ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఐలాపూర్ భూవివాదాల నేపథ్యంలో 1998లో హై కోర్టు స్టే విధించగా.. స్టే ఆర్డర్ను పట్టించుకోకుండా ముఖీం తప్పుడు పత్రాలతో 2006లో గెస్ట్ హౌస్ ను నిర్మించాడు. అంతేకాకుండా 2013 మరోసారి హైకోర్టు స్టే విధించింది. ఈ ఆర్డర్ ను కూడా లెక్క చేయకుండా భూములను ముఖీం అమ్మేశాడు.
2013లో హైకోర్టు (W.A.M.P. No.263/2013) ఇచ్చిన ఆదేశాల ప్రకారం, సంబంధిత భూములపై యాజమాన్యం కలిగిన లేదా ఆక్రమణలో ఉన్న ఎవరైనా ఆ భూముల స్వరూపాన్ని మార్చకూడదు, ధ్వంసం చేయకూడదు అని స్పష్టం చేసింది. ఇలా కోర్టు వివాదాలు పెండింగ్‌లో ఉండగా.. ముఖీం అక్కడి భూములు తెగనమ్మడం ప్రారంభించాడు. స్టే ఆర్డర్ను పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టాడు. వివాదస్పద భూముల్లో దర్జాగా 40 ఎకరాల విస్తీర్ణంలో ముఖీం ఫామ్‌హౌస్ నిర్మించారు. ప్రస్తుతం W.A. No.114, 115, 116/2013, 126/2013తో పాటు, A.S. No.520/2010 కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉండి, తుది విచారణకు రానున్నాయి.
యథాస్థితి ఆర్డర్ మేరకు హైడ్రా చర్యలు..
గత పదేశ్ల కాలంలో ఐలాపూర్ భూములు ఆక్రమణకు గురయిన నేపథ్యంలో అక్కడి భూమిని కాపాడాలని అమీన్‌పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ కు నివేదిక సమర్పించారు. హైకోర్టు (W.A.M.P. No.263/2013 తేదీ: 26.09.2013 న) ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకు యథాతథ స్థితిని కొనసాగిస్తూ, ఆక్రమణలను నివారించాలని హైడ్రాను కోరారు. దీంతో అమీన్ పూర్ మండలం ఐలాపూర్ విలేజ్‌లోని ప్రభుత్వ భూములను రెవెన్యూ, మున్సిపల్, పోలీసు సహకారంతో హైడ్రా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఐలాపూర్ భూముల్లో నిర్మించిన ఇళ్ల జోలికి వెళ్లకుండా కంచె వేసింది. కంచె ఏర్పాటు వల్ల స్థానిక గ్రామస్తులకు, ఐలాపురం తండా నివాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాళీగా ఉన్న భూమిని కాపాడమే లక్ష్యంగా ఫెన్సింగ్ వేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న రిట్ అప్పీలు తుది నిర్ణయం వచ్చే వరకు, సంబంధిత భూములను యథాతథ స్థితిలో పరిరక్షించడంలో భాగంగా హైడ్రా ఈ చర్యలు తీసుకుంది.
Read Also: ఐలాపూర్‌లో హైడ్రా భారీఆపరేషన్ ఎలా సాధ్యమైంది?
Follow Us On : WhatsApp

