కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ముచ్చటగా మూడో సారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన చిరకాల ప్రేయసి గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)ను బాంద్రాలోని తన నివాసంలో అతి కొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి వచ్చిన అతిథులను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అమీర్ ఖాన్ మాజీ భార్యలు, పిల్లలు కూడా ఈ పెళ్లి రావడం విశేషం. ఎలాంటి ఆడంబరాలు లేకుండా జరిగిన ఈ వివాహ వేడుకకు సుమారు 150 మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది.
అమీర్ ఖాన్‌కు గౌరీ స్ప్రాట్‌కు గత 25 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఈ పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే పలు చోట్ల జంటగా కనిపించిన వీరిపై పలు రూమర్లు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఏడాది తన 60వ పుట్టిన రోజు సందర్భంగా అమీర్ ఖాన్ గౌరీతో తన బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బెంగళూరుకు చెందిన గౌరీకి గతంలోనే వివాహం జరిగింది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత అమీర్‌తో తన కొత్త ప్రయాణం ప్రారంభించింది. గౌరీకి ఇది రెండో వివాహం.
ఇక అమీర్ ఖాన్‌కు మాత్రం ఇది మూడో వివాహం. 1986లో అమీర్ తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకున్నా తమ కుమారుడు ఆజాద్‌ను ఇద్దరూ కలిసి పెంచుతున్నారు. ఎక్కడైనా భార్యా భర్తలకు విడాకులు అయితే కనీసం కన్నెత్తి కూడా చూసుకోరు. కానీ, అమీర్ ఖాన్ వ్యవహారం కాస్త భిన్నంగానే ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

