కలం, వెబ్ డెస్క్ : ఆధార్ పీవీసీ కార్డు (Aadhaar PVC Card) పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే పీవీసీ ఆధార్ కార్డుల ధరలను పెంచుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన తయారీ వ్యయం, రవాణా ఛార్జీల దృష్ట్యా ఈ ధరల సవరణ చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. సవరించిన ఈ కొత్త ధరలు 2026, జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు.
రూ. 50 నుంచి రూ. 75కు పెంపు
ఇప్పటివరకు ఆధార్ పీవీసీ కార్డు కోసం వినియోగదారులు రూ. 50 మాత్రమే చెల్లించేవారు. ఇందులో కార్డు తయారీతో పాటు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపించే ఛార్జీలు కూడా కలిపి ఉండేవి. అయితే తాజాగా ఈ ధరను రూ. 75కు పెంచుతూ యూఐడీఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇకపై కార్డు దరఖాస్తు చేసుకునే వారు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి వర్తిస్తుంది?
యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ (myaadhaar.uidai.gov.in) లేదా ఎం-ఆధార్ (mAadhar) మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. కార్డు తయారీకి వినియోగించే మెటీరియల్ ఖర్చులు, పోస్టల్ సర్వీస్ ఛార్జీలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు వివరించారు.
పీవీసీ కార్డు ఎందుకు..?
సాధారణ ఆధార్ పేపర్ కంటే పీవీసీ (PVC) కార్డు ఎంతో మన్నికైనది. ఇది వర్షంలో తడిసినా ఏమీ కాదు, అలాగే జేబులో లేదా పర్సులో పెట్టుకోవడానికి ఏటీఎం కార్డులాగా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు (హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్, ఘోస్ట్ ఇమేజ్) కార్డును నకిలీల బారి నుంచి కాపాడుతాయి.
అప్లై చేసుకునే విధానం..
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి ‘Order Aadhaar PVC Card’ అనే ఆప్షన్ ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 75 చెల్లించిన 5 నుంచి 7 పని దినాలలో స్పీడ్ పోస్ట్ ద్వారా కార్డు మీ ఇంటి చిరునామాకు చేరుకుంటుంది.
Read Also: విజయ్‌కి సీబీఐ నోటీసులు
Follow Us On : WhatsApp


