కలం, వెబ్‌డెస్క్: అమెరికా తదుపరి టార్గెట్ ఇరాన్యేనా? ఆ దిశగా అగ్రరాజ్యం సిద్ధమవుతోందా? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తోంది. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’ సంతకం ఉన్న టోపీ ధరించడం, మరుసటి రోజైన మంగళవారం యూకేలో అగ్రరాజ్యం సైనిక విమానాలు (US air force) కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. యూకేలో అత్యంత కీలకమైన ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్, ఆర్ఏఎఫ్ మిడెన్హాల్ ఎయిర్‌బేస్‌ల్లో అమెరికా సైనిక విమానాలు పెరిగాయి.
ఈ మేరకు ఫ్లైట్ రాడార్ డేటా, యూకే స్థానిక మీడియా వెల్లడించాయి. యూకేకు చేరుకున్న యూఎస్ విమానాల్లో సీ–17 గ్లోబ్‌మాస్టర్ ట్రాన్స్పోర్ట్ ఫైట్స్, ఏసీ–130 గన్షిప్స్ ఉన్నాయి. సీ–17లు సాధారణంగా యుద్ధ హెలికాప్టర్లు చినోక్లను రవాణా చేస్తాయి. ఈ సీ–17లు దాదాపు 10వరకు యూకే బేస్‌లకు చేరినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అమెరికాలోని కెంటకీ, జార్జియాలో ఉన్న ఎయిర్‌ఫీల్డ్స్ నుంచి నేరుగా యూకేకు వచ్చినట్లు చెప్తున్నారు.
ఆర్ఏఎఫ్ ఎయిర్‌బేస్ యూరప్‌లోనే అత్యంత కీలకమైంది. గత ఏడాది ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసిన యూఎస్ బి–2 బాంబర్లు ఎగిరింది ఇక్కడి నుంచే. అప్పుడూ ఈ ఎయిర్‌బేస్‌లో యూఎస్ యుద్ధ విమానాలు (US air force) భారీ సంఖ్యలో కనపడగా, మళ్లీ ఆ స్థాయిలో ఉన్నది ఇప్పుడే. వీటిని ఇరాన్‌పై దాడి కోసమే ఇక్కడికి తరలించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమై ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిరసనలను ఇరాన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తోంది. పోలీసుల కాల్పుల్లో దాదాపు 30మందికి పైగా చనిపోయారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హెచ్చరించారు. నిరసనకారులపై దమనకాండకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ క్రమంలో యూకే ఎయిర్‌బేస్‌ల్లో యూఎస్ యుద్ధ విమానాలు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి వెలువడే ఓ పత్రిక సైతం ఇరాన్ ఆందోళనకారుల తరఫున నిలిచేందుకు యూఎస్ ప్రయత్నిస్తోందంటూ ఓ అమెరికా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.
Read Also: బస్సుకింద పడి డెలివరీ బాయ్ మృతి
Follow Us On: Youtube


