Mobile Popup Ad
Mobile Popup Ad

తరగతి గదులకు అతీతంగా విద్యాభ్యాసం: అశ్విని తానాజీ వాకడే

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, జిల్లా కలెక్టర్, చైర్‌పర్సన్ సమగ్ర శిక్ష మార్గదర్శకత్వం, ప్రత్యేక చొరవతో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మే 15 నుండి ప్రారంభమైన ఈ 15 రోజుల సమ్మర్ క్యాంపులు ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, టీజీఎంఎస్ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. మొత్తం 11 ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా ఈ క్యాంపులను నిర్వహిస్తున్నాయి.

ఇందులో 11 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు విద్యా ప్రగతి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత, శారీరక దృఢత్వం, వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు కల్పిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ క్యాంపులు విద్యార్థులకు తరగతి గదులకు అతీతంగా సార్థకమైన అభ్యాస అనుభవాలను అందిస్తూ సహపాఠ్య కార్యక్రమాలపై ఆసక్తి పెంపొందించేందుకు దోహదపడుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పారమిత హెరిటేజ్ , పద్మనగర్, పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. హన్మంతరావు, భావని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తరగతుల ద్వారా గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటున్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఎక్స్-ఆఫిషియో జిల్లా ప్రాజెక్టు అధికారి డా.అశ్విని తానాజీ వాకడే (Ashwini Tanaji Wakade), ఐఏఎస్ మాట్లాడుతూ.. ఈ సమ్మర్ క్యాంపులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సృజనాత్మక నైపుణ్యాధారిత అభ్యాస కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. “తరగతి గదులకు అతీతంగా జరిగే విద్యాభ్యాసం విద్యార్థులను భవిష్యత్‌కు సిద్ధం చేస్తుంది. ఈ సమ్మర్ క్యాంపులు కేవలం కమ్యూనికేషన్ నైపుణ్యాలను మాత్రమే కాదు, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి,” అని ఆమె పేర్కొన్నారు.

PPP విధానంలో సహకారం అందిస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను ఆమె అభినందించారు. అలాగే మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల గరిష్ట భాగస్వామ్యాన్ని కలిపించేట్లు చూడాలని కోరారు. స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలను క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గంగాధర మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రావు సమన్వయం చేస్తూ విద్యార్థుల పాల్గొన‌డాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలలో నమోదు పెంపుతో పాటు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ సిద్ధతకు ఎంతో దోహదపడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ గుట్టురట్టు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>