ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ గుట్టురట్టు

కలం, క్రైమ్ బ్యూరో: సైబర్ నెరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ (Ghost SIM Card Network)ను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చేధించారు.ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు.వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు,టెలికాం ప్రమోటర్లు,ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను ఛేదించాలనే లక్ష్యంతో 18 ప్రత్యేక పోలీస్ బృందాలు 13 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించి సైబర్ నెరస్థులకు సహకరిస్తున్న 66 మందిని అదుపులోకి తీసుకున్నారు.

రూ.101.87 కోట్ల మోసం

66 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.వాటిలో 432 సీల్డ్ సిమ్‎లు ఉండగా.. 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. నిందితులు దేశవ్యాప్తంగా రూ.101.87 కోట్ల మోసలకు పాల్పడినట్లు సజ్జనార్ తెలిపారు.వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో..నెట్‌వర్క్ సరిగా లేదు,సర్వర్ డౌన్ అయ్యింది,వేలిముద్ర సరిగా పడలేదు అంటూ ఏజెంట్లు నమ్మబలికి.. రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకొని ఈ ముఠా మోసాలకు పాల్పడుతుందని వెల్లడించారు.

నిరుపేదలే లక్ష్యంగా మోసాలు

నిందితులు మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.మొదటగా వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటారు.. ఆ తర్వాత ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తారు.ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్ (e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు.తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, భారత దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ‘సెక్స్‌టార్షన్’ ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే ‘డిజిటల్ అరెస్ట్’ ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారని సజ్జనార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>