Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంకేతాలు

కలం, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచేస్తారని విపక్షాలు ఆరోపించాయి. అయితే తాజాగా ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆర్థిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వినియోగదారులపై భారం తప్పదేమో..

ప్రస్తుత పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే ధరల వినియోగదారులు ధరల పెరుగుదల భారం మోయాల్సి వస్తుందేమోనని ఆయన (RBI Governor) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన ధరలపై ఒత్తిడి పెరుగుతోందని సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తోందని, అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెరుగుతున్న క్రూడాయిల్ ధరలను భరిస్తూ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. అయితే ఈ విధానం దీర్ఘకాలం కొనసాగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణంపై ప్రభావం

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణంపై నేరుగా పడే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించారు. పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయని, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వడ్డీ రేట్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

విదేశీ మారక నిల్వలు కాపాడేందుకు చర్యలు

మరోవైపు విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. అలాగే రూపాయి విలువ స్థిరత్వం కోసం దిగుమతులను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇప్పటికే పిలుపునిచ్చింది. అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం, ప్రజా రవాణా వినియోగం పెంచడం వంటి చర్యల ద్వారా దేశీయ ఇంధన డిమాండ్‌ను నియంత్రించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ చమురు ధరలు దీర్ఘకాలం అధికంగా కొనసాగితే దేశీయ మార్కెట్‌లో ధరల పెంపు అనివార్యమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>