సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష

కలం, వెబ్ డెస్క్: సచివాలయంలో సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-ఏపీలో నియంత్రణా వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని సీఎంకు అధికారులు వివరించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.

సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం- బ్యాంకర్లతో కలిసి రూ.116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడగలిగామని అధికారులు వివరించారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు తమ డబ్బును కోల్పోతున్నట్టు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ అతిపెద్ద ఆర్ధిక నేరంగా మారిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సైబర్, ఆర్ధిక నేరాల్లో రూ.652 కోట్ల మేర కోల్పోయినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై చర్చించారు. సైబర్, ఆర్ధిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు.

ఈ సమీక్షకు హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర ఫోరెన్సిక్స్ సలహాదారు కెపీసీ గాంధీ, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>