పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చట్టసభల్లో డ్రామాలకు చోటు ఉండకూడదని, నినాదాలతో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించవద్దని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే. కావాలంటే విపక్ష ఎంపీలకు తాను కొన్ని టిప్స్ ఇస్తానంటూ ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. సభల్లో ప్రజా సమస్యలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందో ప్రధాని స్పష్టత ఇవ్వాలని ప్రియాంకా ప్రశ్నించారు.
‘ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఢిల్లీ కాలుష్యం, ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వంటి సమస్యలు ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలు. వాటిపై చర్చ కోరడం డ్రామా ఎలా అవుతుంది?’ అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ అంటే ప్రజల కోసం రూపొందించిన వేదిక అని, అక్కడ ప్రజలకు సంబంధించిన విషయాల మీదే చర్చ జరగాలని ప్రియాంకా(Priyanka Gandhi) అన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు నోరు మూయించడం, చర్చ జరగకుండా అడ్డుకోవడం నిజమైన డ్రామా అని ఆమె ప్రతివాదించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కూడా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పార్లమెంట్ చర్చలు జరగాలి కానీ, ప్రధాని మోడీ మళ్లీ నాటకీయ ప్రసంగాలతో విరుచుకుపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజాస్వామ్య చర్చలు జరగకకపోతే దేశ హితం కోల్పోతుందని హెచ్చరించారు.
సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోడీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. సభల్లో నినాదాలు, అంతరాయాలు సృష్టించడం, నిరాశా భావంతో వ్యవహరించడం మంచిది కాదని సూచించారు. పదేళ్లుగా విపక్షాలు ‘అదే ఆట’ ఆడుతున్నాయని, ఇప్పుడు ప్రజలు సహించరని అన్నారు. కొత్త ఎంపీలకు చట్టసభల పని తీరు ఆదర్శంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైతే విపక్షాలకు కొన్ని “టిప్స్” ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఎద్దేవా చేశారు.
Read Also: టిప్స్ ఇస్తా రండి.. విపక్షాలకు మోదీ చురకలు
Follow Us On: X(Twitter)


