ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వ్యాధి కలకలం రేపింది. స్క్రబ్ టైఫస్(Scrub Typhus) అనే వ్యాధి భయాందోళన రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. విజయనగరం(Vizianagaram) జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి (36) గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆమెకు స్క్రబ్ టైఫస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో రాజేశ్వరి మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రబలుతోంది. ఇప్పటివరకు 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ వెల్లడించింది. జిల్లాలవారీగా పరిశీలిస్తే చిత్తూరులో 379 కేసులు, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్య జిల్లాలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కేసులు నమోదవుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పొదలు, పొలాలు, తడి ప్రాంతాలు వంటి ప్రదేశాల్లో కనిపించే కీటకాలు కుట్టినప్పుడు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో పాటు తలనొప్పి, శరీర నొప్పులు, చర్మంపై గాయాలు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
సమయానికి వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్ మందులతోనే స్క్రబ్ టైఫస్(Scrub Typhus) పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. స్వల్ప లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.
Read Also: విడదల రజిని పార్టీ మారబోతున్నారా?
Follow Us On: X(Twitter)


